ప‌్రాణాంత‌క క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో దాదాపుగా ప్ర‌జా జీవితం స్తంభించిపోయింది. ఒక‌టి అరా చోట్ల మాత్ర‌మే జ‌న‌సంచారం ఉంటోంది. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నగరాన్ని  ట్రాఫిక్‌ రద్దీ రహితంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ. 2399కోట్ల వ్యయంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు, రోడ్‌ అండర్‌ బ్రిడ్జిలు, కేబుల్‌ బ్రిడ్జి తదితరవాటి నిర్మాణ పనులు చేపట్టిన విషయం విదితమే. దీని విష‌యంలో తాజాగా పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

 

ఎస్ఆర్‌డీపీకి సంబంధించి రూ. 1500కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రూ.834.44కోట్లతో చేపట్టిన 11పనుల్లో వచ్చే జాన్‌ నాటికి రూ. 436.52కోట్ల విలువైన పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకు అనుగుణంగా లాక్‌డౌన్‌ సమయాన్ని జీహెచ్‌ఎంసీ, ఆయా నిర్మాణ సంస్థలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రణ, మళ్లింపు వంటి సమస్యలు లేనందున నిరాటంకంగా రేయింబవళ్లూ పనులు కొనసాగిస్తున్నారు. వైరస్‌ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఎక్కువ యంత్రాలను ఉపయోగిస్తూ తక్కువ మంది కార్మికులు ఉండేలా నిబంధనలు అమలు చేస్తున్నారు. 

 

కాగా, నగరంలో 1800 కోట్ల వ్యయంతో చేపట్టిన 709 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ఇతర రాష్ర్టాలనుంచి బీటీ సరఫరాకు మార్గం సుగమం అయింది. లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోవడంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లనుంచి రావాల్సిన బీటీ రాక నిలిచిపోయింది. ప్రస్తుత సమయాన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్ల పునరుద్ధరణ పనులకు సద్వినియోగం చేసుకోవాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. అంతేకాదు, బీటీ వాహనాలకు అంతరాయం లేకుండా చూడాలని డీజీపీని కోరారు. దీంతో ఆయన పొరుగు రాష్ర్టాలతో మాట్లాడి బీటీ లారీలు యథావిథిగా వచ్చేవిధంగా తగిన చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం నుంచి యథావిధిగా పనులు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: