సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పేదలకు బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ పంపిణీలో కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బయోమెట్రిక్ పరికరాలు సరిగ్గా పని చేయడం లేదని... ప్రజలు రేషన్ దొరకక ఇబ్బందులు పడుతున్నారని... పలు ప్రాంతాలలో రేషన్ కోసం జనం గుంపులు గుంపులుగా ఒకే చోట చేరుతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. 
 
గతంలో ప్రభుత్వం 15 రోజుల పాటు రేషన్ ఇస్తామని ప్రకటన చేయగా తాజాగా ఈ నిబంధనలను సవరించింది. ఏప్రిల్ నెల మొత్తం రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు బియ్యం తీసుకున్నవారికే ప్రభుత్వం 1500 రూపాయలు జమ చేస్తుందని వస్తున్న వార్తలపై పౌరసరఫరాల శాఖ సంస్థ ఛైర్మన్ స్పందించారు. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని... బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా నగదు జమ అవుతుందని తెలిపారు. 
 
రాష్ట్రంలో వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకున్నవారు వేలిముద్ర వేయకుండానే రేషన్ తీసుకోవచ్చని తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని... రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా నగదు జమవుతుందని తెలిపారు. రేషన్ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ప్రజలు ఇబ్బందులు పడకుండా తాము అన్ని చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటన చేసింది. 
 
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో 1500 రూపాయల నగదు, 12 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 229కు చేరింది. రాష్ట్రంలో నిన్న భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: