ఆదివారం రాత్రి దేశంలోని అందరూ విద్యుత్ ను ఆపేయాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోడి సూచనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రి 9 గంటల నుండి 9 నిముషాల పాటు దేశంలోని జనాలందరూ విద్యుత్ ను ఆపేసి క్యాండిళ్ళు, మొబైల్ ఫ్లాష్ లైట్లు లాంటివి వెలిగించాలని పిలుపిచ్చారు. ఆ పిలుపులోని పరమార్ధం ఎవరికీ అర్ధం కావటం లేదు. వైరస్ అనే చీకట్లను పారదోలి వెలుగుల్లోకి ప్రయాణం చేయగలమన్న సంకేతాలు ఇవ్వటానికే ఇలా  చేయాలని మోడి చెప్పిన కారణాలను చాలా మంది విచిత్రంగా చూస్తున్నారు.

 

ఇప్పటికే వైరస్ కు వ్యతిరేకంగా ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూ అంటే పాటించారు. మూడు వారాలు లాక్ డౌన్ అంటే కట్టుబడి పాటిస్తున్నారు. మళ్ళీ ఇపుడు వైరస్ కు వ్యతిరేక పోరాటంలో ఐకమత్యాన్ని చాటాలని చెప్పటం  ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.  సరే మోడి పిలుపు సంగతి ఎలాగున్నా ప్రధాని చెప్పినట్లు అందరూ ఇళ్ళల్లోని విద్యుత్ ను నిలిపేస్తే దేశవ్యాప్తంగా విద్యుత్ గ్రిడ్లు కుప్పకూలిపోవటం ఖాయమని ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

మామూలుగా దేశం మొత్తం మీద వాడే విద్యుత్ తో పోల్చుకుంటే ప్రస్తుతం 40 శాతం మాత్రమే వినియోగం అవుతోంది. లాక్ డౌన్ కారణంగా ఐటి కార్యాలయాలు, వర్తక, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామికవాడలు, ఉత్పత్తి ప్లాంట్లు ఇలా అన్నీ దాదాపు  నిలిచిపోయాయి. ఒక్కాసారిగా దాదాపు విద్యుత్ వినియోగం నిలిచిపోవటంతో మామూలు సామర్ధ్యంతో పోల్చితే ఇపుడు 40 శాతమే వినియోగం అవుతోందట.  దీనివల్ల లోడ్ ఫ్యాక్టర్లో చాలా తేడాలు వచ్చేసిందని ఇంజనీర్లు అంటున్నారు.

 

ఇపుడు ప్రధానమంత్రి చెప్పినట్లుగా  మొత్తం స్విచ్చులు ఆపేస్తే ఇళ్ళల్లోని ఏసిలు, ఫ్రిడ్జులు, ఫ్యాన్లు ఆపాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ జనాలు వాటిని కూడా ఆపేస్తే లోడ్ ఫ్యాక్టర్ మొత్తం కుప్పకూలిపోయి విద్యుత్ వ్యవస్ధే అధోగతి పాలవ్వటం ఖాయమంటున్నారు. నిజంగా అదే గనుక జరిగితే ఆసుపత్రులకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా విద్యుత్ గ్రిడ్లన్నీ కుప్పకూలిపోతే అది మరో సమస్యకు దారి తీస్తుందన్నారు. హోలు మొత్తం మీద ఇంజనీర్ల ఆందోళనను పక్కన పెట్టేస్తే రాజకీయంగా కూడా ప్రధాని పిలుపుపై తీవ్ర విమర్శలు మొదలైపోయాయి. కరోనా వైరస్ సమస్యపై  శాస్త్రీయంగా పోరాటం చేయాలి కానీ తప్పట్లు కొట్టండి, స్విచ్చులు ఆపేయాలని పిలుపిస్తే విచిత్రంగా ఉంటుందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: