ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని చెప్పటంతో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలవుతోంది. పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నా కొన్ని ప్రాంతాలలో ప్రజలు అవసరం లేకపోయినా వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. హైదరాబాద్ లో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నగరంలోని పాత బస్తీలో అనవసరంగా రోడ్లపైకి వాహనదారులు వస్తున్నారు. 
 
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్లపైకి వచ్చేవారిపై జీవో 45, 46, 48ల ప్రకారం పోలీస్ శాఖ కేసులు నమోదు చేస్తోంది. వీరిపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులపై కేసులు నమోదైతే పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో, విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు చెబుతున్నారు. 
 
అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. కనిష్టంగా ఆరు నెలలు... గరిష్టంగా సంవత్సరం జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో పోలీసులు ఇప్పటికే భారీ స్థాయిలో వాహనదారులపై కేసులు నమోదు చేశారు. కాంటాక్ట్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలో ఇప్పటివరకూ 2774 కేసులు నమోదు చేశారు. లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుంచి దాదాపు 1,50,000 వాహనాలపై కేసులు నమోదయ్యాయి. 
 
హెల్మెట్ పెట్టుకోకపోవడం, లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడం, పత్రాలు లేకపోవడం లాంటి అంశాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 229కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: