ప్రపంచాన్ని కరోనా వైరస్‌ తలకిందులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే స‌మ‌యంలో కొత్త స‌మ‌స్య‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా మ‌రో సున్నిత‌మైన అంశం వివాదాస్ప‌దంగా మారింది. ఆ దేశం...ఈ దేశం అనే తేడా లేకుండా ప్ర‌తి దేశం పౌరుల హ‌క్కుల‌ను హ‌రిస్తున్నాయ‌ట‌. కీల‌కంగా మారిన క‌రోనా చికిత్స స‌మ‌యంలో ప్ర‌వేశ‌పెడుతున్న నిర్ణ‌యాలు ఇబ్బందిగా మారుతున్నాయ‌ని పేర్కొంటున్నారు. యూరప్‌, అమెరికాలో మొద‌లైన ఆందోళ‌న ఇప్పుడు భార‌త్‌కు చేరింది. 

 

క‌రోనా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా కరోనా హాట్‌ స్పాట్‌ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, వారికి ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి వంటి వ్యూహాలు ఖరారు చేయడానికి ప్రజలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేది వారి సెల్‌ ఫోన్‌ లోకేషన్స్ ఆధారంగా ప్రభుత్వాలు తెలుసుకుంటున్నాయి. అమెరికాలోని దాదాపు 500 నగరాలపై ప్రత్యేకంగా దష్టి పెట్టింది. క్వారంటైన్‌ ఆదేశాలను ప్రజలు ఎంతవరకు పాటిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ సమాచారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో అనుమానిత వ్యాధిగ్రస్తులుగా గుర్తించిన వారి కదలికలను తెలుసుకోవడం కూడా సులవవుతుందని అధికారులు అంటున్నారు. అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సిడిసి) ఫేస్‌ బుక్‌ లాంటి ప్లాట్‌ ఫామ్స్‌ నుంచి ఈ సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్లున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జనరల్‌ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 

 

కాగా, ఈ స‌మాచార సేక‌ర‌ణ అమెరికాకే ప‌రిమితం కాలేదు. యూరోపియన్‌ యూనియన్‌ లోని టెలికం ఆపరేటర్లు సైతం జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా లాంటి దేశాల్లో సైతం ఇదే ప్ర‌క్రియ జ‌రుగుతోంది.  స్పెయిన్‌ కూడా డేటా కోవిడ్‌ పేరిట ఇలాంటి కార్యక్రమాన్నే చేపట్టింది. దేశంలోని మొబైల్‌ ఆపరేటర్ల సహకారంతో జాతీయ గణాంకాల సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని స్పెయిన్‌ తెలిపింది.  ఇండియాలో ‘కరోనా కవచ్‌’ అనే యాప్‌ ను భారత ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టింది. మొబైల్‌ ఫోన్లలోని లోకేషన్‌ డేటాను షేర్‌ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మొబైల్‌ యూజర్‌ లను కోరింది. దాని ఆధారంగా… ఎవరైనా హైరిస్క్‌ జోన్‌ లో ఉంటే అప్రమత్తం చేయడానికి వీలుంటుందని స్పష్టం చేసింది. కోవైడ్‌ -19 కేసుల సమాచారాన్ని అందించడానికి, ఆ సమాచారాన్ని విశ్లేషించడానికి మాత్రమే దీనిని వినియోగిస్తామని తెలిపింది. ఇక్కడ వ్యక్తుల గోప్యతను తప్పకుండా పాటిస్తామని, వారి పేర్లుగానీ.. వారికి సంబంధించిన ఇతర సమాచారం గానీ ఎవరికీ అందించమని స్పష్టం చేసింది. కాగా, ఈ ప్ర‌క్రియ‌ల‌పై ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: