అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... రానున్న రెండు వారాలలో తమ దేశం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టే ప్రస్తుతం అమెరికాలో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. మొదటి కరోనా కేసు నమోదైనప్పుడు... దానిని ఆదిలోనే అంతం చేయకుండా... ఎండాకాలం వస్తే కరోనా వ్యాప్తి తగ్గిపోతుందని అంటూ ట్రంప్ కరోనా నిర్మూలన కొరకై సకాలంలో సరైన ప్రణాళికలు రచించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాని కారణంగా ప్రపంచ దేశాల్లో అమెరికా దేశం కరోనా వైరస్ కు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే దాదాపు 2.78 లక్షల ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు.


గురువారం రాత్రి 8.30 గంటల వరకు 5926 మంది కరోనా పీడితులు మరణించగా... శుక్రవారం రాత్రి 8:30 గంటల లోపు అనగా గత 24 గంటలలో ఏకంగా 1480 మంది కరోనా దెబ్బకి పిట్టల్లా రాలిపోయారు. కేవలం ఇరవై నాలుగు గంటలలో ఇంత మంది చనిపోవడం అమెరికాలో ఇదే మొదటిసారి. దాంతో అధ్యక్షుడు ట్రంప్ తో పాటు చాలా మంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని తక్కువ అంచనా వేసిన ట్రంప్ ప్రస్తుతం అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న అమెరికా నగరాలలో రక్షణ వస్తువులు అనగా మాస్కులు, గ్లౌజులు, గౌన్లు, వెంటిలేటర్లు ఎక్కువగా లేవు. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాలంటే ధరల బాగా మండిపోతున్నాయి. దాంతో ఎక్కడి ప్రాంతం వారు అక్కడే వ్యక్తిగత రక్షణ వస్తువులను తయారు చేసుకుంటున్నారు. వీలుకానప్పుడు ప్రాణాలకు తెగించి మరీ రక్షణ వస్తువులను ధరించకుండానే కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులకు చికిత్సనందిస్తున్నారు.


ఈ క్రమంలో చాలామంది వైద్యులు కూడా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఒకవైపు నమోదవుతుండగా... మరోవైపు వెంటిలేటర్ల కొరత ఎక్కువవుతోంది. అలాగే సమర్థవంతమైన మాస్కుల కొరత కూడా ఏర్పడుతుంది. అందుకే నిన్న డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... ఇళ్లలో నివసించే సాధారణ ప్రజలు N-75 మాస్కులను కొనకూడదని... అవి కేవలం వైద్యులకు, కోవిడ్ 19 వ్యాప్తి ని అరికట్టే సిబ్బందికి మాత్రమేనని... N-95 మాస్కుల బదులు అందరూ సాధారణమైన మాస్కులు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించినంత మాత్రాన సోషల్ డిస్టెన్సింగు లాంటి తగు జాగ్రత్తలు పాటించకుండా ఉంటే వైరస్ వ్యాప్తి ఆగకుండా ఉండదని, అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలని ట్రంప్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: