ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు 9 నిమిషాల పాటు లైట్లన్నీ ఆఫ్ చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు బాల్కనీలోకి వచ్చి లాంతర్లు, కొవ్వొత్తులు మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని మోదీ ఇచ్చిన పిలుపు గురించి కొందరు విమర్శలు చేస్తున్నారు. మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ ఇలా చేయడం వల్ల ఎమర్జెన్సీ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని చెప్పారు. 
 
ఒకే సమయంలో అన్ని లైట్లను ఆఫ్ చేస్తే గ్రిడ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని... అత్యవసర సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలా చేస్తే డిమాండ్ కు, సరఫరాకు మధ్య వ్యత్యాసం ఏర్పడుతుందని పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని చెప్పారు. గతంలో 23 వేల మెగావాట్ల డిమాండ్ ఉండగా ఆ డిమాండ్ 13 వేల మెగావాట్లకు పడిపోయిందని అన్నారు. 
 
గ్రిడ్ ఫెయిల్ అయితే విద్యుత్ సర్వీసులను మరలా పునరుద్ధరించడానికి 12 నుంచి 16 గంటల సమయం పడుతుందని తెలిపారు. ఫ్యాక్టరీ యూనిట్లను ఆపరేట్ చేసే విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా గురించి జరుపుతున్న పోరాటంలో విద్యుత్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. మోదీ ఇచ్చిన పిలుపుపై మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అహ్మద్ కూడా విమర్శలు చేశారు. 
 
కాంగ్రెస్ నేతలు కూడా ప్రధాని మోదీ పిలుపుపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మోదీకి లాక్ డౌన్ తరువాత పరిస్థితుల గురించి, భవిష్యత్ గురించి ఎలాంటి విజన్ లేదని విమర్శలు చేశారు. దేశంలోని కార్మికులకు, శ్రామిక జీవులకు వేతనాలు మంజూరు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహూవా మొయిత్రీ కోరారు. ఫేక్ న్యూస్ అణచివేత పేరుతో రియల్ న్యూస్ ను అణచివేయవద్దని ఆమె కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: