ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గడచిన 12 గంటల్లో 16 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 185కి చేరుకుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కొత్తగా శనివారం ఉదయమే రెండు కేసులు బయటపడటం సంచలనంగా మారింది. అంటే ఇప్పటికి తిరుపతిలో బయటపడిన కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. ఈ మూడు కేసులు కూడా ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ప్రార్ధనలకు వెళ్ళి తిరిగి వచ్చిన వారివే కావటం గమనార్హం.

 

నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా  32 నమోదయ్యాయి. అలాగే కృష్ణా జిల్లాలో 27, గుంటూరు జిల్లాలో 23, కడప జిల్లాలో 23,  ప్రకాశం జిల్లాలో 18, విశాఖపట్నం జిల్లాలో 15, ఉభయగోదారి జిల్లాల్లో 30, చిత్తూరులో 10, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చెరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

మొత్తం మీద ఏపిలో ఒక్కసారిగా కేసులు బయటపడటం వెనుక ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ప్రార్ధనలే ప్రధాన కారణంగా అర్ధమవుతోంది. అక్కడికి వెళ్ళి వచ్చిన వారి వల్లే కేసుల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది.  ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమైపోతోంది.

 

కేసుల వ్యాప్తిని నియంత్రించటానికి ప్రభుత్వం ఎంతగా చర్యలు తీసుకుంటున్నా కేవలం కొందరి వైఖరి  వల్లే ఉపయోగం లేకుండా పోతోంది. ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన వారిలో ఇంకా కొందరు పరీక్షలు చేయించుకోకుండా తప్పించుకు తిరుగుతున్నారని స్వయంగా జగనే  చెప్పటం గమనార్హం. తప్పించుకు తిరుగుతున్న వారిని పట్టుకోవటానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా ఉపయోగం కనబడటం లేదు.  వైరస్ తీవ్రత తెలీకుండా ఏదో పిల్ల చేష్టలతో కొందరు చేస్తున్న ఆకతాయి పనుల వల్లే మొత్తం సమాజానికే ప్రమాదకరంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా జనాలందరూ ప్రభుత్వాలకు సహకరిస్తేనే వైరస్ మహమ్మారిని తరిమి కొట్టగలం. లేకపోతే అంతే సంగతులు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: