ఇండియా అన్నది బయట చెప్పుకున్నట్లుగా గొప్పగా ఉండదు. అవును నిజంగా  ఉండదు. కానీ ఇండియాను ఎలా చెప్పుకోవాలంటే గొప్పోళ్ళు ఎక్కువగా ఉన్న పేద దేశమని. నూరు శాతం సంపది కేవలం ఇరవై శాతం ఇంట్లో దాచుకున్న ఇండియాగా చెప్పాలి.

 

మరి లాక్ డౌన్ అంటే ఆస్తులు ఉన్న వారు ఇంట్లో ఉంటారు. వారికి మంచి ఇల్లు ఉంది. దానికి తాళం కూడా ఉంది. కానీ ఈ దేశంలో ఆకాశమే కప్పుగా, భూమే తలదాచుకునే గూడుగా చేసుకుని నూటికి ఎనభై శాతం మంది జీవిస్తున్నారు. వారి సంగతేంటన్నదే పెద్ద ప్రశ్న.

 

ఈ దేశంలో పేద జనం ఎంత గొప్ప వాళ్ళు అంటే తాము ఎండకు ఎండి అక్కడే  మండి సంపాదించి కట్టిన పన్నులతో ఖరీదైన సేవకులను పెట్టుకుంటారు. వారికి జీతాలు ఇస్తారు. వారే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ఇంకా లక్షల్లో కోట్లు  సంపాదించే సెలిబ్రిటీలు ఇలా వారంతా తన నెత్తిన పెట్టుకుని యుగాలుగా మోస్తున్నారు.

 

మరి వారంతా ఉండేది ఆరు బయటే. వారికి కాపలా పెట్టలేరు. ఇంతవరకూ ఎవరూ ఆలా ఆలోచించలేదు కూడా. వారినే కాపలా పెట్టుకుని దర్జాలు ఒలకబోసే వారు. ఇపుడు వారిని ఇంట్లో పెట్టి తాళం వేయాలి. లేకపోతే కరోనా కాటేస్తుంది. వారు మనుషులు కాబట్టి వారి నుంచి కూడా కరోనా కాటేస్తుంది.

 

మొత్తానికి కరోనా పుణ్యమా అని వారిని మనుషులుగా ప్రభువులు గుర్తించారు. కానీ ఒక్కసారిగా భారత జనాభాను అంతా ఎక్కడ దాచగలరు. ఒక్క రోజు కాదుగా ఎన్ని రోజులో ఎవరికీ తెలియదు గా. ఇక రెక్కాడితే కానీ డొక్కాడని వారిని అలా వదిలేస్తే డబ్బున్న వారి బతుకులు కూడా బుగ్గి అయిపోతాయి. 

 

అందువల్ల వారికి కరోనా అంటకుండా రక్షించుకోవాలి. నిజంగా ఇది చాలా పెద్ద సవాల్, ఇప్పటివరకూ ఈ శతాబ్దం  ఎదురుచూడని సవాల్. అన్నింటా ఆధునికం అనుకున్న నవ భారతం చూస్తున్న సవాల్. డెబ్బయ్యేళ్ళ పాటు అధికారం ఇస్తే మురికి కాలువ పక్కన పేదల బతుకులు, ఇరుకు బతుకులు పెంచారు తప్ప వారికి కనీసం కూడూ గుడ్డా ఇవ్వలేకపోయారు. ఇపుడు ఈ తక్కువ టైంలో ఏమవుతుంది.

 

పోనీ వారి మీద స్వారీ చేసి కోట్లకు పడగలెత్తిన ఆసాములైనా ఈ టైంలో సహాయం చేస్తారా. వారు చచ్చినా చేయరు. ఎందుకంటే వారు దేవుడి దీవెనలతో అలా దర్జా బతుకులు సంపాదించుకున్న నయా జమీందార్లు. మరి ఎలా. ప్రభుతాలు అడిగితే తమ అక్రమ సంపాదనలో వెంట్రుక వాసంత విదిలించి అదే గొప్ప అనుకుంటున్న నయా జమీందార్లు తమను కరోనా వైరస్ నుంచి పాలకులను  కాపాడమంటున్నారు.

 

కానీ ప్రభుత్వం ఎనభై శాతం పేదలకు దుప్పటి కప్పి మూత వేయగలదా. అసలు కుదరదు. వాళ్ళను వదిలేసే కరోనా కాటుకు మొదట బలి అయ్యేది వాళ్ళే. సరే అనుకున్నా వారితో అది ఊరుకోదుగా, కార్చిచ్చులా వ్యాపించి  అందరికీ అంటే బంగాళాలు కట్టుకున్న ఆసాముల ఇళ్ళను ముట్టడిస్తుంది. అందర్నీ కబలిస్తుంది. 

 

ఇన్నాళ్ళూ రోడ్డున ఉన్న పేదలకు ఏ భయం లేదు, ఆ మాటకు వస్తే బతుకు భయం అంతకంటే లేదు. కానీ కోట్లు పోగేసుకున్న పెత్తందార్లూ, నయా జమీందార్లకు చావు అంటే భయం ఉంది. అందువల్ల వారు తమ కోసమైనా పేదలను ఆదుకోవడానికి ముందుకు రావాలి. దానికి  ఇదే సరైన సమయం. లాక్  డౌన్ అయినా మరోటి అయినా పాలకులు పేదలకు  చేసేది ఏమీ లేదు.

 

పేదల ఆకలి మంటలను ఎక్కడికక్కడ తీర్చే బాధ్యతలు పెద్దలు తీసుకుంటేనే మేలు. సెలిబ్రిటీలు,  తెర మీద కదలాడే బొమ్మలు, ఇంతకాలం వారు కట్టిన పన్నులతో ఆస్తులు పోగేసుకున్న వారు తలా కాస్తా తమ ప్రాంతాల్లో పేదల బాధ్యత  తీసుకుంటే, వారి ఆకలి చల్లారిస్తే  లాక్ డౌన్ విజయవంతం అవుతుంది. అపుడే కరోనా వైరస్ కూడా అంతమవుతుంది. లేకపోతే ఆకలి పేద అందరికీ మంట పెట్టేస్తాడు. అది కరోనా మంట కూడా కావచ్చు. తస్మాత్ జాగ్రత్త.

 

మరింత సమాచారం తెలుసుకోండి: