క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా...ప్ర‌స్తుతం అన్ని రంగాల్లోనూ ప్ర‌భావం ప‌డిన సంగ‌తి తెలిసిందే. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు లాక్‌డౌన్ విధించారు. క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ వేదిక‌గా పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేనందున సాధ్యమైనంత వేగంగా రోడ్డు నిర్మాణ పనులు నిర్వహించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. 

 

రహదారుల సమగ్ర కార్యనిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ) కింద 709.49 కిలో మీటర్లమేర ప్రధాన రోడ్లను ఐదేళ్లపాటు నిర్వహించేందుకు ప్రభుత్వం 1839 కోట్లతో 7 ప్యాకేజీల పనులను మంజూరు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు పనులు కేటాయించింది. మొదటి ఏడాదిలో 50 శాతం రోడ్ల రీ కార్పెటింగ్‌, రెండో ఏడులో 30శాతం, మూడో ఏడులో 20శాతం రీకార్పెటింగ్‌ పూర్తిచేయాలని నిర్ణయించారు. మిగిలిన రెండేళ్లు వాటిని పాడైపోకుండా నిర్వహించాలి. వీటితో పాటు గుంతల పూడ్చివేత, రోడ్లపై నీలిచే నీటిని తొలగించడం, పారిశుధ్య పనులు, యంత్రాల ద్వారా రోడ్లను ఊడ్చడం, ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయడం వంటి పనులు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. 

 

నిర్వహణదారులు ఏటా పాడైన ప్రాంతాల్లో రోడ్లను బాగు చేయాలి. లేన్‌ మార్కింగ్స్‌ వేయాలి. ఫుట్‌పాత్‌లకు రంగులు అద్దాలి. సెంట్రల్‌ మీడియంను అందంగా ఉండేలా తీర్చిదిద్దాలి. ఎక్కడిక్కడ రోడ్డు భద్రత సూచికలను ఏర్పాటు చేయాలి. ఫుట్‌పాత్‌లు, సెంట్రల్‌ మీడియాలపై పచ్చదనాన్ని పెంపొందించాలి. ఈ ఐదేండ్లలో ఇంకా ఏదైనా అదనపు పనులు చేపట్టాల్సివస్తే అంచనా వ్యయం ప్రకారం సదరు సంస్థలే నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి జీహెచ్‌ఎంసీ అదనంగా చెల్లిస్తుంది. రోడ్ల తవ్వకాలను అనుమతించే అధికారాన్ని ప్రైవేటు ఏజెన్సీలకే అప్పగించారు. వీట‌న్నింటినీ పూర్తి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. రోజుకు 10నుంచి 15కిలోమీటర్ల వరకు రీకార్పెటింగ్‌ పనులు పూర్తిచేసున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు రేయింబవళ్లూ పనిచేయనున్నారు. ఇప్పటికే 45కిలోమీటర్ల మేర రీ కార్పెటింగ్‌ పూర్తి చేసి 2 వేలకుపైగా గుంతలను పూడ్చివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: