కరోనా వైరస్ పై ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. ఇప్పటి వరకు ఆ వైరస్ కు మందు కనిపెట్టకపోయినా, కొన్ని కొన్ని దేశాల్లో ఆ వైరస్ ను రకరకాల వైద్య పద్ధతుల ద్వారా కొన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి. కరోనా వైరస్ సోకిన వారి నుంచి మరికొంతమందికి సోకే అవకాశం ఉందన్న అనుమానం ఉన్న వారిని క్వారంటెన్ చేయడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోగలుగుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకిన బాధితులు 15 మందికి గత 15 రోజులుగా చికిత్స అందిస్తున్నారు సికింద్రాబద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు. వారికి ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తూ వారికి ఆ వైరస్ నుంచి విముక్తి కల్పించారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధితులకు చికిత్స అందించడంలో తమ చిత్తశుద్ధిని ప్రదర్శించి పూర్తిగా ఆ పదిహేను మంది బాధితులు కోలుకునేలా చేయడంతో వారి పై ప్రశంసలు కురుస్తున్నాయి.


 సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు గత కొన్ని రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను డిశ్చార్జి చేసి శనివారం సురక్షితంగా వారి వారి స్వస్థలాలకు ప్రత్యేక వాహనాల్లో పంపించారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్, కరోనా కోర్ కమిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రాజారావు, నోడల్ అధికారి ప్రభాకర్ రెడ్డి డిశ్చార్జ్ అయిన కరోనా బాధిత రోగులతో కలిసి ఫోటోలు దిగారు. 15 రోజులుగా వీరికి చికిత్స అందించడంతోపాటు, వారికి రెండుసార్లు కరోనా టెస్ట్ లు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో శుక్రవారం రాత్రి వారిని డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన వీరంతా వివిధ ప్రాంతాలకు చెందిన వారు. భద్రాచలం, కొత్తగూడెం, నిజామాబాద్, ఇండోనేషియా కు చెందిన వారు ఈ 15 మంది ఇందులో ఉన్నారు. 


ఇప్పటి వరకు ఆసుపత్రిలోనే వీరికి ప్రత్యేక వైద్యం అందించారు. అయితే స్వస్థలాలకు పంపించినా, 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో మాత్రమే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని వైద్యులు సూచించారు. అలాగే ప్రస్తుతం డిశ్చార్జి అయిన కరోనా బాధితుల వివరాలు ప్రజా ఆరోగ్య శాఖకు అందిస్తామని, వారు తరచుగా వీరి ఇళ్లకు వెళ్లి పర్యవేక్షిస్తారని, ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 15 మంది కరోనా బాధితులకు చికిత్స అందించడమే కాకుండా వారి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి చేయడంపై గాంధీ ఆసుపత్రి వైద్యులు చిత్తశుద్ధిని పలువురు ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: