తెలంగాణ రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 272కు చేరింది. రాష్ట్రంలో కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితం అయిన ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ హాట్‌స్పాట్లుగా గుర్తించింది. తెలుస్తున్న సమాచారం మేరకు అధికారులు రాష్ట్రంలో 25 కరోనా ప్రభావిత హాట్‌స్పాట్లు ఉన్నట్లు తేల్చారు. ఈ హాట్‌స్పాట్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 
 
ఈ 25 ప్రాంతాలలో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వీటిని అధికారులు హాట్‌స్పాట్లుగా గుర్తించారు. రాష్ట్రంలో మర్కజ్ మినహా కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువని ప్రభుత్వం భావిస్తోంది. హాట్‌స్పాట్లుగా గుర్తించిన వాటిలో కరీంనగర్, నిజామాబాద్ అర్బన్, వరంగల్ అర్బన్, పాతబస్తీ, తదితర ప్రాంతాలు ఉన్నట్లు తెలుస్తోంది. 
ప్రభుత్వం అధికారికంగా హాట్‌స్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సి ఉంది. 
 
10వ తేదీ నాటికి హాట్‌స్పాట్ల సంఖ్య 50కు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. వైరస్ నియంత్రణకు ఈ ప్రాంతాలలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ ప్రాంతాలలో వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించి లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం హాట్‌స్పాట్ల పరిధి ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
ప్రభుత్వం ఈ నెల పదో తేదీ నాటికి రాష్ట్రంలో 600 కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ప్రభుత్వం 15వ తేదీ తర్వాత విడతల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశం ఉంది. ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేసినా దశలవారీగా కర్ఫ్యూ కొనసాగుతుందని తెలుస్తోంది. ఆరోగ్యశాఖ ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తివేత ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. హాట్‌స్పాట్లలో మాత్రం పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే లాక్ డౌన్ ఎత్తివేస్తారని తెలుస్తోంది. లాక్ డౌన్ గురించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: