ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఇక అమెరికాలో మాత్రం విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టికే సుమారు మూడుల‌క్ష‌ల‌మందికిపైగా క‌రోనా బారిప‌డ్డారు. సుమారు ఎనిమిదివేల మందికిపైగా క‌రోనాతో మృతి చెందుతున్నారు. ఇక‌ రోజుకు వంద‌ల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్న దేశంగా అగ్ర‌రాజ్యం నిలుస్తోంది. మున్ముందు మ‌ర‌ణాల సంఖ్య కూడా భారీగా పెరిగే ప్ర‌మాదం పొంచివుంది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ పూట‌గ‌డుపుతున్నారు. క‌రోనా వైర‌స్ బారి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో తెలియ‌క అమెరికా ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 

 

అమెరికాలో ప్ర‌స్తుతం అన్నింటికీ కొర‌తే ఏర్ప‌డుతోంది. ఇందులో ప్ర‌ధానంగా మందుల కొత‌ర కూడా తీవ్ర‌మ‌వుతోంది. ఇదిలా ఉండ‌గా.. భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. అంతేగాకుండా, అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌ను ర‌ద్దు చేసింది. అలాగే.. మార్చినెలాఖ‌రులో ప‌లు ఎగుమ‌తుల‌ను కూడా తాత్కాలికంగా ర‌ద్దు చేసింది. ఇందులో ప‌లు మందులు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని అభ్య‌ర్థించారు. త‌మ దేశానికి అవ‌స‌ర‌మైన‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపించాల‌ని కోరారు. అయితే..  ఈ నేప‌థ్యంలోనే అమెరికాకు అవ‌స‌ర‌మైనంత‌ హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును అమెరికాకు పంపించాల‌ని ప్రధాని నరేంద్ర మోడిని కోరినట్లు ఆ దేశ‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 

 

వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఈ విష‌యాన్ని స్వ‌యంగా డొనాల్డ్ ట్రంప్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను భార‌త్ పెద్ద‌మొత్తంలో త‌యారు చేస్తుంద‌ని, త‌మ‌కు అవ‌స‌ర‌మైనంత విడుద‌ల చేయాల‌ని మోడీని అభ్య‌ర్థించిన‌ట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ అభ్య‌ర్థ‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే క‌రోనా క‌ట్ట‌డికి భార‌త్‌కు అమెరికా భారీగా ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, స‌త్సంబంధాలు కొనసాగించేందుకు భార‌త్ కూడా సానుకూలంగా స్పందిస్తుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: