క‌రోనా వైర‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తోందా..?  వైర‌స్ ప్ర‌భావాన్ని ముందే ప‌సిగ‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం చెందిందా..?  క‌ట్ట‌దిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌డ‌బ‌డుతున్నారా..? ప‌్ర‌జ‌ల‌కు ఆయ‌న భ‌రోసా ఇవ్వ‌లేక‌పోతున్నారా..?  ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌  హ‌వా ఇక ముందు త‌గ్గిపోతుందా..?  అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ఏపీలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. ప్ర‌తీరోజు ప‌దుల సంఖ్య‌లో కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నిజానికి.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశంలోని తెలంగాణ‌తోపాటు ప‌లు రాష్ట్రాలు ముందస్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నాయి. 

 

కానీ.. ఏపీలో మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్టే క‌నిపించింది. విద్యాసంస్థ‌ల‌కు కూడా ఆల‌స్యంగా సెల‌వులు ప్ర‌క‌టించింది. ముఖ్యంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లను సీఎం జ‌గ‌న్ తీసుకోలేక‌పోయార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయితే.. చూస్తుండ‌గానే.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర‌మైంది. ఇక ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జ‌రిగిన మ‌ర్క‌జ్ ఉదంతం త‌ర్వాత ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. ఏపీ నుంచి వెయ్యిమందికిపైగా మ‌ర్క‌జ్‌కు వెళ్లి వ‌చ్చారు. ఈ విష‌యాన్ని కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముంద‌స్తుగా గుర్తించ‌లేక‌పోయింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. 

 

అయితే.. ఆ త‌ర్వాత అప్ర‌మ‌త్త‌మై వారిని గుర్తించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. కానీ.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఏపీలో మొద‌టి మ‌ర‌ణం కాకినాడ‌లో సంభ‌వించింది. మ‌ర్క‌జ్‌కు వెళ్లి వ‌చ్చిన యువ‌కుడి తండ్రి క‌రోనాతో మృతి చెంద‌డంతో స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యం అందుకున్న వైపీసీ.. ఆ త‌ర్వాత ప‌లు అంశాల‌తో క్ర‌మంగా ప్ర‌జ‌ల్లో కొంత గంద‌ర‌గోళం రేపింద‌నే చెప్పొచ్చు. రాజ‌ధాని అమ‌రావ‌తితోపాటు ప‌లు విష‌యాల్లో తీసుకున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో సీఎం జ‌గ‌న్ విఫ‌లం అవుతున్నార‌నే టాక్ కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా మున్ముందు ఆయ‌న హ‌వాను త‌గ్గించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: