ప్రపంచంపైకి అణు బాంబులను విసిరే సత్తా ఉన్న దేశం..! సైనిక సంపత్తిలో తిరుగులేని దేశం..! సంపద విషయంలో పైచేయి సాధించిన దేశం..ఎన్ని ఉన్నా ఏంటి లాభం..ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోలేని దుస్థితి...! కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తే.. కంటిముందు శవాల కుప్పలు కనిపిస్తుంటే.. దిక్కు తోచని అమెరికా ఇతరదేశాల సాయం కోసం అర్జిస్తోంది.. వేడుకుంటోంది.

 

ట్రంప్ మీడియాతో ఎప్పుడు మాట్లాడినా... వైట్ హౌస్ నుంచి ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చినా... ఆయన మాటల్లో అగ్రరాజ్యపు అహంకారం ఖచ్చితంగా కనిపిస్తుంది...ఆయన చెప్పాలనుకున్న దానిని చెప్పడం తప్ప ఎవరి మాట వినే అలవాటు ట్రంప్‌కు స్వతహాగా లేదు. జర్నలిస్టులు ఎవరైనా ఎదురుతిరిగి ప్రశ్నిస్తే... ఫేక్ మీడియా అంటూ ముద్ర వేస్తారు ట్రంప్. 

 

కానీ వారం రోజులుగా ట్రంప్ మాట తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల సీజన్‌లో ఉత్సాహంగా కనిపించాల్సిన ఆయన ప్రసంగాలు...కరోనా ప్రభావంతో దీనంగా మారిపోయాయి... ట్రంప్‌లో ఉత్సాహం కూడా తగ్గిపోయింది. కరోనాతో అమెరికాకు ఎలాంటి ముప్పు లేదంటూ జనవరి రెండో వారంలో గట్టిగా చెప్పిన ట్రంప్...ఇప్పుడు మరణ మృదంగం మోగుతుండటంతో ఢీలా పడిపోయారు. ఇతర దేశాలు కనికరం చూపించాలి అనేంతగా.

 

ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని సడలించి యాంటీ మలేరియా డ్రగ్స్ తమ దేశానికి పంపించాలని మోడికి విజ్ఞప్తి చేశారు ట్రంప్. హైడ్రోక్లోరోక్విన్ మందులను పంపించాలని మోడీని కోరారు .కరోనా విజృంభిస్తుండటంతో ఇటీవలే భారత్... అన్ని రకాల మందుల ఎగుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే అమెరికా విషయంలో మోడీ సానుకూలంగా స్పందిస్తారని ట్రంప్ ఆశాభావంతో ఉన్నారు.

 

చైనా తమ దేశంపై కుట్ర చేసి వుహాన్ వైరస్‌ను అమెరికాకు పంపించిందని నిన్న మొన్నటి వరకు విమర్శలు గుప్పించిన ట్రంప్...ఇప్పుడు కరోనా కట్టిడి కోసం చైనా సాయం కూడా తీసుకుంటున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లను చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది అమెరికా..  శానిటైజర్ల నుంచి వెంటిలేటర్ల వరకు దాదాపు 25 రకాల వస్తువుల కొరత ఉన్నట్లు వైట్ హౌస్ గుర్తించింది. మిత్ర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలని ట్రంప్ అధికారులను ఆదేశించారు. అమెరికా , రష్యాలు చాలా విషయాల్లో భిన్న ధృవాలుగా పనిచేస్తాయి. శతృత్వాన్ని ప్రదర్శిస్తాయి. కానీ కరోనా వీళ్ల మధ్య కూడా దూరాన్ని తగ్గించింది. ప్రత్యేక వైద్య పరికరాలను ఇటీవలే రష్యా అమెరికాకు పంపింది.. 

 

మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కావడం , మరణాలు పదివేలకు చేరువలో ఉండటంతో  ట్రంప్ తలపట్టుకున్నారు. ఇప్పటి వరకు చేసిన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటూ... ఇప్పుడు ఇతర దేశాల సాయం కోసం ఎదురుచూస్తున్నారు ట్రంప్...

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: