కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు చికిత్స లేదు. రోగమొచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా సామాజిక దూరాన్ని పాటించడమే నివారణమార్గంగా ఎంచుకున్నారు. అయితే అమెరికాలో మాత్రం సోషల్ డిస్టన్స్‌ పాటించడంలో ఆలస్యమైంది. అమెరికా చేసిన మొదటి తప్పు ఇదే..!

 

అమెరికాలో జనవరి 20వ తేదీన తొలి కరోనా కేసు నమోదైంది. ఇప్పుడు 2 లక్షల 77వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. 7 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే బాధితుల సంఖ్య లక్ష దాటింది. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ కరోనా బాధితులున్నారు. జనవరి 20వ తేదీన తొలి కేసు నమోదైతే అది దేశమంతా విస్తరించే వరకూ ప్రభుత్వం నిద్రపోయింది.

 

కరోనా వైరస్‌కు ఇప్పుడు అమెరికానే హాట్‌స్పాట్‌గా మారింది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్‌ ప్రపంచమంతా సోకుతూ వచ్చింది. అయితే చైనా మాత్రం దీన్ని కట్టడి చేయడంలో సక్సెస్ అయింది. ఆ దేశంలో బాధితుల సంఖ్య 81వేల దగ్గర ఆగిపోయింది. కానీ అమెరికాలో ఆలస్యంగా ఈ వైరస్‌ ప్రవేశించినా అది విస్తరిస్తున్న తీరు మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమవడంతో రాబోయే రెండు వారాలు మరింత గడ్డు పరిస్థితిని అమెరికా చూడబోతోంది. సాక్షాత్తూ ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.

 

ప్రపంచమంతా సోషల్‌ డిస్టన్స్ పాటిస్తూ కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నించాయి. కానీ అమెరికాలో మాత్రం వింటర్‌ను ఆహ్వానించే పేరుతో సంబరాలు చేలుకుంటూ వచ్చారు. ఫ్లోరిడా తీరమంతా కుర్రకారుతో హుషారెత్తిపోయింది. న్యూయార్క్‌లో సబ్‌వేలు కార్లతో కిక్కిరిసిపోయాయి. లూసియానాలో ఓ చర్చి పాస్టర్‌ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వేలాది మందితో సమావేశాలు నిర్వహించారు. పైగా మతపరమైన కార్యక్రమాలను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదని ఆ పాస్టర్‌ స్పష్టం చేశారు.

 

సామాజిక దూరం పాటించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రజలను నామమాత్రంగా కోరింది. అంతేకానీ నిర్బంధంగా అమలు చేయలేదు. కానీ ప్రభుత్వ వైద్య వర్గాలు మాత్రం అమెరికన్లను పదేపదే హెచ్చరించాయి. సామాజిక దూరం పాటించకుంటే వైరస్‌ వ్యాప్తిని అరికట్టలేమని, ప్రజలు సహకరించాలని కోరాయి. అయితే అమెరికన్లు ఏమాత్రం పట్టించుకోలేదు. వింటర్‌ను ఆహ్వానించే సంబరాలపైనే అమెరికన్లు ఎక్కువ ఆసక్తి చూపించారు.

 

అయితే, న్యూయార్క్‌లో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అక్కడ మాత్రం ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసింది. కానీ అక్కడ కూడా ప్రజలు పట్టించుకోలేదు. స్కూళ్లు, యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. వీళ్ల ద్వారా వైరస్‌ శరవేగంగా విస్తరించింది. అయినా అక్కడి ప్రజల్లో ఏమాత్రం మార్పు రావట్లేదు. ఇప్పటికీ ఇరుగుపొరుగు నగరాలు, రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. న్యూయార్క్‌ లాంటి నగరంలో కూడా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కావట్లేదు. 

 

మరోవైపు యూరోపియన్ దేశాల నుంచి అమెరికా వచ్చిన వారికి ఎయిర్‌పోర్టుల్లో సమగ్రంగా పరీక్షలు నిర్వహించలేదు. ఒకోసారి వేలాది మంది రావడంతో అందరినీ టెస్ట్‌ చేసే పరిస్థితి కూడా లేదు. దీంతో దేశంలోకి రోగులు సులభంగా ప్రవేశించగలిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: