అమెరికాలో అధికారం చిత్రవిచిత్రంగా ఉంటుంది. ఫెడరల్ ప్రభుత్వం.. అంటే కేంద్ర ప్రభుత్వం మాట రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోవు. కరోనాపై యుద్ధం సాగిస్తున్న వేళ కూడా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కలసి ముందుకు సాగడం లేదు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరిదారి వారిదే అన్నట్టు సాగుతున్నాయి. ఇది కూడా కరోనా విజృంభణకు ఓ కారణం. 

 

ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దేశమంతా ఏకతాటిపై నడిచినప్పుడే దానిపై విజయం సాధించడానికి వీలవుతుంది. కానీ అమెరికాలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. కేంద్రం, రాష్ట్రాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రాలకు విస్తృతస్థాయిలో అధికారాలు ఉండడంతో కేంద్రం కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. కరోనాపై మూకుమ్మడిగా పోరు సాగించడంలో ఎవరికివారే అన్నట్టు వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది.

 

రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు అమలవుతున్నాయి. డెమోక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ట్రంప్ సూచలనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నాయి. వైరస్‌ వ్యాప్తికి డెమోక్రాట్లే కారణమంటూ ట్రంప్‌ విమర్శించడానికి కారణమిదే.! అయితే మొద్దు నిద్ర నిద్రపోయి ఇప్పుడు మేల్కొన్నారంటూ ట్రంప్‌పై డెమోక్రాట్లు కూడా విరుచుకుపడుతున్నారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్‌ కరోనా వైరస్‌ విస్తరించడానికి కారణమైంది. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ లాంటివి అమలు చేయగా మరికొన్ని పట్టించుకోలేదు. దీంతో రాకపోకలు యధావిధిగా సాగాయి. వైరస్‌ వ్యాపించసాగింది. ఇలాంటి సమయాల్లో అన్ని రాష్ట్రాలు కలసికట్టుగా సాగి ఉంటే నష్టం తక్కువగా ఉండేది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు వ్యవహరించడం వల్లే ఆర్థికంగానే కాక ప్రాణనష్టం కూడా ఎక్కువగా ఉంది.

 

వ్యాధిని అరికట్టడంలో సక్సెస్‌ అయిన రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాలు గుణాపాఠాలు నేర్వలేదు. పంతానికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇప్పుడు న్యూయార్క్‌ హాట్‌స్పాట్‌గా మారింది. ఇదే పరిస్థితి మున్ముందు మరిన్ని నగరాలకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. న్యూయార్క్‌ను చూసి కొన్ని రాష్ట్రాలు జాగ్రత్త పడుతున్నాయి. మరికొన్ని మాత్రం లైట్‌ తీసుకుంటున్నాయి. ఇది మరో విపత్తుకు దారితీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా స్పందిస్తుండడం వల్ల ట్రంప్‌కు తలనొప్పులు ఎక్కువయ్యాయి. కరోనాపై యుద్ధాన్ని రాజకీయం చేస్తున్నాయంటూ అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ తాను అధికారంలోకి రావాలనుకుంటున్న ట్రంప్ .. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. అటు డెమోక్రాట్లు కూడా తక్కువేం తినలేదు.. వాళ్లు కూడా రాజకీయకోణంలోనే చూస్తు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.

 

అయితే అమెరికాలో కూడా కొన్ని బలహీన రాష్ట్రాలున్నాయి. రాజకీయ పోరులో ఆ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు కాకపోవడంతో సొంతంగా వైద్య సామాగ్రిని సమకూర్చుకోలేకపోతున్నాయి. దీంతో ఫెడరల్‌ సర్కార్‌వైపు చూస్తున్నాయి. కానీ అక్కడి నుంచి సరైన స్పందన లేదు. దీంతో పలు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: