ప్రపంచంలో కరోనాను ధీటుగా ఎదుర్కొంటున్న దేశం ఏది..? అమెరికా లాంటి అగ్రరాజ్యమే సాయం కోసం ఇతర దేశాలను ఆర్జిస్తుంటే... ఆ ఒక్కదేశం మాత్రం కరోనాను ఎలా కట్టడి చేయగలుగుతుంది..? 

 

తైవాన్... కరోనా కష్టకాలంలో ఇప్పుడు ఈ దేశం పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంతర్జాతీయ మీడియా ఈ దేశాన్ని కీర్తిస్తోంది. ప్రపంచ ఆరోగ్య నిపుణులు కూడా తైవాన్ శభాష్ అంటూ పొడుగుతున్నారు.. దీనికి కారణం ఒక్కటే... కరోనాపై తైవాన్ చేస్తున్న యుద్ధం సత్ఫలితాలను ఇస్తోంది. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా తైవాన్...కట్టుదిట్టమైన వ్యూహాలతో కరోనాను నిలువరిస్తోంది.

 

తైవాన్ చైనాకు అతి సమీపంలో ఉన్న ఓ ఐలాండ్... జనాభా మూడు కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ నమోదైన కేసులు కేవలం 355 మాత్రమే. ఇక కరోనా మరణాలు కేవలం ఐదు మాత్రమే. ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతుంటే...చైనాకు దగ్గర్లో ఉండి కూడా సేఫ్‌జోన్‌ను పాటిస్తోంది తైవాన్. దీనికి కారణం ఒక్కటే గతం నుంచి గుణపాఠం నేర్చుకోవడం. 2003 లో కరోనా జాతికే చెందిన సార్స్ మహమ్మారి చైనాతో పాటు అనేక దేశాలను కుదిపేసింది. కరోనా తరహాలో కాకపోయినా అప్పుడు కూడా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సార్స్‌తో ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో తైవాన్ కూడా ఉంది... సార్స్‌ను కట్టడి చేసేందుకు అప్పట్లో లక్షన్నర మందిని క్వారంటైన్ చేశారు.

 

సార్స్‌ అనుభవాలను మర్చిపోని తైవాన్... కరోనా విషయంలో మిగతా దేశాల కంటే వేగంగా స్పందించింది. అందరూ జనవరి ఆఖర్లోనో, ఫిబ్రవరిలోనో మేల్కొంటే...తైవాన్ మాత్రం వుహాన్‌లో పరిస్థితి చేజారిపోకముందే అప్రమత్తమైంది. కరోనా నష్టం తైవాన్‌పై అతి తక్కువగా ఉండే విధంగా యాక్టన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు 124 అంశాలతో వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. దాన్ని యధాతథంగా అమలు చేశారు. ముందుగా సరిహద్దులను మూసివేశారు. ఇతర దేశాల నుంచి ఒక్కరు కూడా రాకుండా నిషేధం విధించారు. 

 

చైనాకు దగ్గరగా ఉండటం వల్ల తమకు ముప్పు ఎక్కువగా ఉందని ముందే గ్రహించిన తైవాన్.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. సోషల్ డిస్టెన్సింగ్‌ను తూచ తప్పకుండా పాటించారు. తైవాన్‌లో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తారు. వైద్యులకు కూడా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్‌ను ముందే సిద్ధం చేసి పెట్టారు. వైద్య పరికరాలు, వస్తువుల ఎగుమతిపై ఆంక్షలు విధించి దేశ వ్యాప్తంగా కొరత లేకుండా చూసుకున్నారు. 

 

ఇచ్చిన జాగ్రత్తలు తీసుకున్న తైవాన్...కరోనాను కట్టడి చేయడమే కాదు.. ఇతర దేశాలకు సాయం అందించే స్థాయికి చేరుకుంది. కోటికి పైగా మాస్క్‌లను వివిధ దేశాలకు డొనేట్ చేసింది. అందుకే అందరి ప్రశంసలు అందుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: