కేవలం సోషల్ డిస్టన్సింగ్ మాత్రమే కాదు.. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అనేక తప్పులు చేశారు. దీంతో ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారు.. ప్రజలు కూడా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంతకూ ట్రంప్ చేసిన తప్పులేంటి..? 


 
జనవరిలోనే వైరస్‌ సోకినా మార్చి వరకూ కరోనాపై పెద్దగా దృష్టి పెట్టలేదు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్.! మొదట్లో చైనాను తిట్టిపోయడానికే ఆయన సమయమంతా కేటాయించారు. వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్‌ను చైనీస్‌ వైరస్‌గా ఆయన సంబోధించారు. చైనాను బ్లేమ్‌ చేయడంపై చూపించిన శ్రద్ధ స్వదేశంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టడంపై పెట్టి ఉంటే బాగుండేదని పలువురు సూచిస్తున్నారు.

 

నాలుగు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ మున్ముందు మరింత కఠిన పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఏప్రిల్‌ రెండో వారం తర్వాత పరిస్థితులు కుదుటపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు మాత్రం దేశంలో భయానక వాతావరణం నెలకొందని.. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా కలసి రావారని కోరారు.

 

జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఇటలీలో మారణహోమం కొనసాగింది. అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. కరోనా ప్రభావాన్ని తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. తమ దేశానికి వచ్చిన ముప్పేమీ లేదంటూ ప్రగల్బాలు పలికారు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.. ఒకవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా... పరిస్థితి అదుపులోనే ఉందంటూ కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు ట్రంప్.

 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తే బాగుంటుందని ట్రంప్‌కు సూచించినా ఆయన పెడచెవిన పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తే ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమోననేది ట్రంప్ భయం. అందుకే ఆయన సాహసించలేదు. న్యూయార్క్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నా... అక్కడ కూడా లాక్‌డౌన్‌ అమలు చేయాల్సిన అవసరం లేదని కొట్టిపారేసారు ట్రంప్..! దీన్ని బట్టి ఆయన ఎంత లైట్‌ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

 

అమెరికా ప్రభుత్వ వైద్య వర్గాలు మాత్రం తాజా పరిస్థితిపై మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. భారీ నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోందన్నారు. వైద్య వర్గాల హెచ్చరికలను సైతం అధ్యక్షుడు ట్రంప్‌ పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: