ఆ మధ్య పాలు పోస్తున్న వ్యక్తిని రక్తం కారేలా పోలీసులు కొట్టారు. ఊళ్లల్లో చిన్న దుకాణాలకు బైక్‌లపై నిత్యావసరాలను తీసుకెళ్తున్న వాళ్లను లాఠీలతో చితకబాదారు. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అని సరుకు రవాణా ఎక్కడికక్కడ ఆగిపోయింది. దేశంలో పరిస్థితి చూస్తే ముఖ్యంగా దక్షిణ భారతం నుంచి బియ్యం, పప్పులు ఉత్తర భారతానికి రవాణా అవుతాయి. ఉత్తర భారతం నుంచి గోధుమలు, గోధుమ పిండి ఇతర నిత్యావసరాలు ఇటు దక్షిణాదికి వస్తుంటాయి. లాక్‌ డౌన్‌ ప్రకటించిన తర్వాత అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు సరుకులు రవాణా జరిగిన ధాఖలాలు లేవు.

 

సరుకు రవాణా చేయాలంటే లారీ డ్రైవర్‌ ఇంటి నుంచి పనిచేసే ప్రాంతానికి వెళ్లాలి. అతనితోపాటు క్లీనర్‌ ఉంటాడు. అలాగే గోదాముల్లో పనిచేసే వాళ్లు వెళ్లాలి. యజమాని బయటకు రావాలి. అదే గోధుమలు లేదా ఇతర పదార్ధాలను పిండి ఆడాలంటే..  మిల్లులకు వర్కర్లు రావాలి. కానీ.. లాక్‌డౌన్‌ పేరుతో ఎవరినీ ఇళ్ల నుంచి కదలనివ్వడం లేదు. మరి.. అలాంటప్పుడు ఈ పనులు ఎలా సాగుతాయి. వాహనాలు ఎలా కదులుతాయి? ఈ ప్రభావం క్షేత్రస్థాయిలో నిత్యావసరాల ధరపై పడుతోంది. ఇదే కాదు.. ఒక నగరం లేదా పట్టణాల్లో ఆయా దుకాణాలకు సరుకులు వెళ్లాలన్నా అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఆయా దుకాణాల్లో ఉన్న సరుకు ఖాళీ అవుతోంది. దీనికితోడు ఉన్నకొద్దిపాటి సరుకుకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో రేట్లు పెంచేస్తున్నారు. మరికొందరైతే పరిస్థితిని ముందే ఊహించి రేట్లు అమాంతం పెంచేశారు. 

 

తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలవుతున్న సమయంలో సరిహద్దుల్లో ఆగిపోయిన సరుకు రవాణా వాహనాలకు అనుమతి ఇస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అయితే ఈ అనుమతులు తర్వాతి కాలంలో కొనసాగించినా.. పై రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఆంక్షల ఫలితంగా వాహనాలు వచ్చే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ ప్రకటించిన కొత్తలో చాలామంది డిపార్ట్‌మెంట్‌ స్టోర్లకు, దుకాణాలకు పోటెత్తి అవసరం ఉన్నా లేకపోయినా ముందుగానే సరుకులు కొనుగోలు చేసి జాగ్రత్త పడ్డారు. కానీ మధ్యతరగతి ప్రజలు ఇలాంటి పరిస్థితిని వస్తుందని ఊహించలేకపోయారు. రోజూ ఆంక్షలు సడలిస్తున్న సమయంలో పెద్దసంఖ్యలో దుకాణాలకు, కూరగాయల మార్కెట్లకు, డిపార్ట్‌మెంట్ స్టోర్లకు, నిత్యావసరాలు లభించే మాల్స్‌కు పరుగులు పెడుతున్నారు. దీంతో సామాజిక దూరం అటకెక్కుతోంది. 

 

ఒకవైపు ప్రభుత్వాలు నిత్యావస వస్తువుల ధరలను బ్లాక్‌ చేసినా.. లేదా అదనపు ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ  ధరలు సామాన్యులను కలవర పెడుతున్నాయి.  ప్రజల వాదల అలా ఉంటే.. పాలకుల మాట ఇలా ఉంది. కానీ.. క్షేత్రస్థాయిలో నిత్యావసరాల ధరలు మండిపోతూనే ఉన్నాయి.  మరి..ఈ పరిస్థితి నుంచి సామాన్యులు గట్టెక్కేది ఎలా? ఇదే అంతు చిక్కడం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: