ముఖ్యమంత్రి అయి పది నెలలు అయింది. రాజకీయాల్లోకి వచ్చి పది ఏళ్ళు  అయింది. అయినా రాజకీయాల్లో మూల సూత్రం మాత్రం మన యువ ముఖ్యమంత్రికి వంటబట్టినట్లు లేదు. పక్కనే రాజకీయ గండర గండడు చంద్రబాబు ఉన్నారు. కనీసం ఆయన్ని చూసి కొంతైనా నేర్చుకుంటే ఇలాంటి విషయాల్లో ఒడ్డున పడేవారు.

 

కానీ జగన్ కి లౌక్యం  తెలియకపోవడం వల్ల చిక్కుల్లో పడిపోయారు. నిజానికి జగన్ కోపమంతా స్థానిక ఎన్నికలను హఠాత్తుగా తనకు చెప్పకుండా వాయిదా వేశారని. కానీ దానికి కరోనా సాకు చెప్పారని ఆయన మండిపోయారు. ఆ మండిపాటుతో ఆయన కరోనా వైరస్ మీద కూడా కొన్ని తేలిక మాటలు వాడేశారు.

 

కరోనాదేముంది, అది జ్వరం లాంటిదే. వచ్చినా బాధేంలేదు, ఎవరూ చనిపోరు లాంటి మాటలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని జగన్ వాడారు. అదే ఇపుడు ఆయన్ని జనం ముందు దోషిగా నిలబెట్టేందుకు కారణమవుతోంది. అనూహ్యంగా కరోనా వైరస్ ఏపీలో  వీర విహారం చేస్తోంది. కేవలం ఆరెడు కేసులు మొదట్లో ఉండేవి. ఆ తరువాత అవి 23 దాకా పాక్కుంటూ వచ్చాయి. అక్కడ నుంచి ఆ వేగం ఆగడంలేదు. ఇపుడు వందల్లో ఏపీలో కేసులు తేలుతున్నాయి.

 

దాంతో కరోనా మహమ్మారి అంటే ఇప్పటికైనా  అర్ధమైందా అంటున్నాయి విపక్షాలు. అంతే కాదు, కరోనా వైరస్ విషయంలో తేలిగ్గా తీసుకుంటారా అంటూ చంద్రబాబు దగ్గర నుంచి అందరూ జగన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. జగన్ నోటి వెంట లైట్ గా తీస్కోండి అని మాట అన్నారే కానీ ముఖ్యమంత్రిగా ఆ తరువాత కరోనా మీద యాక్షన్ ప్లాన్ విషయంలో  ఆయన సీరియస్ గానే ఉన్నారు.

 

ప్రభుత్వంగా చేయాల్సినవి కూడా చేస్తున్నారు. కానీ ఆయన మొదట్లో అన్న మాటలనే పట్టుకుని రాజకీయ రచ్చ చేస్తోంది విపక్షం. ఈ పరిణామంతో జగన్ చేసిన శ్ర‌మ అంతా బూడిద‌లో పోసిన పన్నీరు అవుతోంది. దాదాపుగా రెండు వందల పై చిలుకు ఉన్న టీడీపీ అనుకూల  సోషల్ మీడియాలో జగన్ని బదనాం చేస్తూ పారాసైట్ మాల్ సీఎం, బ్లీచింగ్ పౌడర్ సీఎం అంటూ దారుణంగా ఒక్కటే  ట్రోల్ చేస్తున్నారు. 

 

మొత్తానికి ముఖ్యమంత్రిగా ఇప్పటిదాకా మంచి నిర్ణయాలు తీసుకుని జనం ముందు మెప్పు పొందిన జగన్  కరోనా వైరస్  విషయంలో మాత్రం తడపడి పొరపడి చివరకిలా దొరికిపోయారని అంటున్నారు. అందుకే జగన్ కూడా లౌక్యంగా మాట్లాడడం నేర్చుకోవాలని హితులు సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: