అమెరికాలో న్యూయార్క్... మన దేశంలో మహారాష్ట్ర... కరోనా పాజిటివ్ కేసులు విషయంలో ఇవే టాప్ లిస్టులో ఉన్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని స్థాయిలో మహారాష్ట్రలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తీవ్రత ఇలాగే ఉంటే లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించే ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం.

 

కరోనా కేసుల వ్యాప్తిలో మహారాష్ట్ర అతి పెద్ద హాట్ స్పాట్‌గా మారిపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని కేసులు మహారాష్ట్రలో నమోవుతున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 700లకు చేరువలో ఉన్నాయి. ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో 55 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 145 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు.  కరోనా మరణాల్లో కూడా మహారాష్ట్రనే ముందుంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 35 మంది కరోనాతో చనిపోయారు.

 

కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలుచేస్తున్నా... రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు కొనసాగిస్తున్నా కేసులు వేగంగా పెరగడంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పుణె, థానే, సంగ్లి, నాగ్‌పూర్, అహ్మద్‌నగర్, యవత్నాల్‌, బుల్దానా, సతారా, కొల్హాపూర్, ఔరంగాబాద్‌, రత్నగిరి, నాసిక్ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లివచ్చిన వారి కారణంగా... ఇతర రాష్ట్రాల్లో లాగే మహారాష్ట్రల్లోనూ కేసులు పెరిగాయి.

 

ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడగా చెప్పుకునే ముంబైలోని ధారవి కరోనా కేసలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఓ డాక్టర్‌తో కలిపి మొత్తం ఐదుగురికి ఇక్కడ కరోనా వచ్చింది. దీంతో ధారవి మొత్తాన్ని పోలీసులు సీల్‌ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటి పోయే పరిస్థితులు కనిపిస్తుండటంతో లాక్ డౌన్‌ను పొడిగించే ఆలోచనలో ఉంది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే లాక్‌డౌన్‌ను పొడిగించడం తప్ప మరో మార్గం లేదని మంత్రులు చెబుతున్నారు. కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14తో  దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ ముగుస్తుంది. అయితే మహారాష్ట్రలో మరో రెండు వారాలు పొడిగించే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: