ప్ర‌స్తుతానికి క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు మందు లేదు.. ఎలాంటి వ్యాక్సిన్ కూడా లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వైద్యులు ఓ ప్ర‌యోగం చేస్తున్నారు. క‌రోనా నుంచి కోలుకున్న వారి ర‌క్తంలోని ప్లాస్మాతో బాధితుల‌కు చికిత్స చేస్తూ స‌త్ఫ‌లితాల‌ను సాధిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప‌ద్ధ‌తి చాలా ఆశాజ‌న‌కంగా ఉన్న‌ట్లు అమెరికా, చైనా, ఫ్రాన్స్ శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. నిజానికి.. ర‌క్తంలోని ప్లాస్మాతో చికిత్స చేయ‌డం కొత్త‌దేమీ కాదు. చాలా ఏళ్ల కింద‌టి నుంచే దీనిని ఉప‌యోగిస్తున్నారు. వైర‌స్‌ల‌కు వ్యాక్సిన్ లేన‌ప్పుడు ఈ ప్లాస్మా చికిత్స‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే.. ఇదే పూర్తిస్థాయి చికిత్స మాత్రం కాదు.. ప్రస్తుతం క‌రోనా బారి నుంచి బాధితుల‌ను కాపాడేందుకు మ‌నముందున్న చిన్న‌పాటి ఆశాదీప‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. యాంటీబాడీలతో కూడిన ఈ ప్లాస్మాను సేకరించి కొత్తగా కరోనా బారిన పడిన రోగుల శరీరంలోకి ఎక్కిస్తే వైరస్‌ను ఎదుర్కొనే శక్తి ఆ వ్యక్తికి అందుతుందని అంటున్నారు. భార‌త్‌లో కూడా ప్లాస్మా చికిత్స అందించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప‌లువురు చెబుతున్నారు. అయితే.. ఆ చికిత్స ఎలా చేస్తారో..? అస‌లు ప్లాస్మా అంటే ఏమిటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.. 

 

*మ‌న శ‌రీర‌ రక్తంలో  55 శాతం వ‌ర‌కు ప్లాస్మా ఉంటుంది. రక్తం నుంచి రక్త కణాలను వేరుచేయగా మిగిలేదే ప్లాస్మా. ఇందులో నీరు, లవణాలు, ఎంజైమ్‌లతోపాటు అతిముఖ్యమైన రోగ నిరోధక కణాలు ఇమ్యునోగ్లోబ్యులిన్స్‌ ఉంటాయి. వ్యాధులను ఎదుర్కోవడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి* అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అయితే.. క‌రోనా బారి నుంచి కోలుకున్న వ్య‌క్తి ర‌క్తం నుంచి ప్లాస్మాను సేక‌రించి, బాధితుల‌కు చికిత్స చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చికిత్సా ప‌ద్ధ‌తిని అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ గుర్తించ‌డం గ‌మ‌నార్హం.  ‘ఎక్స్‌పాండెడ్‌ యాక్సెస్‌' పేరిట ప్లాస్మా సేకరించే కార్యక్రమాన్ని కూడా ఇప్ప‌టికే ప్రారంభించింది. ర‌క్తం నుంచి ప్లాస్మా సేక‌ర‌ణ‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అమెరికాలో క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష మందికిపైగా క‌రోనా బారిన‌ప‌డ్డారు. సుమారు మూడువేల‌మందికిపైగా మ‌ర‌ణించారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా బాధితుల‌ను కాపాడేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప‌లు ద‌వాఖాన‌ల్లో కూడా ప్లాస్మా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్లాస్మాను దానంచేయడానికి కరోనాను జయించిన అమెరిక‌న్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: