ఏపీ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ 15 నుంచి బుకింగ్స్ ప్రారంభించింది. ఏసీ బస్సులు మినహా మిగిలిన అన్ని సర్వీసులకు ఆర్టీసీ రిజర్వేషన్లను ప్రారంభించింది. ఈ నెల 14తో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దేశీయ విమానయాన సంస్థలు, రైళ్లు 15వ తేదీ ప్రయాణాలకు బుకింగ్స్ ప్రారంభించాయి. అధికారులు బస్సుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అల్ట్రా డీలక్స్ బస్సులు, సూపర్ డీలక్స్ బస్సులకు రిజర్వేషన్లు ప్రారంభించారు. 
 
అధికారులు ప్రయాణికుల కోసం 90% నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను ఎక్కువగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అధికారులు విజయవాడ నుంచి నాన్ ఏసీ సర్వీసులను మాత్రమే ప్రారంభించనున్నారు. ఏసీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఏసీ సర్వీసులను అందుబాటులోకి తెస్తారని సమాచారం. 
 
ఈ నెల 15న విజయవాడ నుంచి హైదరాబాద్ కు 115 సర్వీసులు, విజయవాడ నుంచి తిరుపతికి 14 సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చినా ప్రయాణికులు ఆసక్తి చూపించకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే 127 రైళ్లకు కూడా బుకింగ్స్ ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది. 
 
ఈ నెల 14వ తేదీ తరువాత లాక్ డౌన్ కొనసాగుతుందని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాదని తెలుస్తోంది. 14వ తేదీ తరువాత కేంద్రం ఆయా రాష్ట్రాలలో కరోనా ప్రభావాన్ని బట్టి ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. దేశంలో కరోనాను పూర్తి స్థాయిలో నియంత్రించే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయని తెలుస్తోంది. కేంద్రం నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 60 కొత్త కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 252కు పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: