ఇంత‌టి సాంకేతిక‌యుగం.. అయినా అంతుచిక్క‌ని వైర‌స్‌.. కంటికి చిక్క‌ని శత్రువు.. చైనాలోని వుహాన్‌న‌గ‌రం కేంద్రంగా పుట్టిన క‌రోనా వైర‌స్‌ చూస్తుండ‌గానే ప్ర‌పంచాన్ని చుట్టేసింది. చూస్తుండ‌గానే మాన‌వాళి మ‌నుగ‌డ‌కు ప్ర‌మాద‌కారిగా మారింది. ల‌క్ష‌ల్లో బాధితులు.. వేల‌ల్లో మ‌ర‌ణాలు.. ఇంత‌టి విప‌త్తును గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని ప్ర‌పంచం.. దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనేక దేశాల్లో ద‌య‌నీయ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. బాధితుల‌కు వైద్యం అందించేందుక ఆస్ప‌త్రులు స‌రిపోవ‌డం లేదు. అవ‌స‌ర‌మైన వైద్య సిబ్బంది లేదు. చివ‌ర‌కు వారికి అవ‌స‌ర‌మైన మాస్క్‌లు, గ్లౌస్‌లు కూడా స‌రిప‌డా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

 

ఇక‌ వృద్ధుల‌ను ప‌క్క‌న‌ప‌డేసి..కేవ‌లం యువ‌త‌కే వైద్యం అందించే ద‌య‌నీయ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ ఘ‌ట‌న‌లు స్పెయిన్‌లో అనేకం చోటుచేసుకున్నాయి. 85ఏళ్ల త‌ల్లిని ఆస్ప‌త్రికి తీసుకెళ్తే.. వైద్యం చేయ‌కుండా.. బ‌య‌ట‌కు పంపించార‌ని, కేవలం యువ‌త‌కే వైద్యం చేస్తున్నార‌ని ఓ బిడ్డ క‌న్నీటిప‌ర్యంత‌మైంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌తిరోజూ కోకొల్ల‌లు. ప్రపంచ దేశాల్లో అమెరికాలోనే అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. మృతుల సంఖ్య ఏకంగా సుమారు 9వేల‌కుపైగా ఉంది. ఇక‌ ఇటలీ తర్వాత అత్యధిక కరోనా మృతులు స్పెయిన్‌లో నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజే 674 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 13 వేలకు చేరువలో ఉంది. కేసులు లక్షా 40 వేలు దాటేశాయి.

 

 ఈ ప్ర‌పంచంలో అగ్ర‌రాజ్యంగా ఉన్న అమెరికాలో బాధితుల‌కు వైద్య‌సేవలు అందించ‌లేని పరిస్థితి. ముఖ్యంగా కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న న్యూయార్క్‌లో రోగులకు చికిత్స అందించడానికి వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో లైసెన్స్‌ కలిగిన వైద్య సిబ్బంది సాయానికి రావాలంటూ నగర మేయర్‌ బిల్‌ పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. అంతేగాకుండా.. ఏప్రిల్, మే నెలల్లో 45 వేల మంది వైద్య సిబ్బంది అవసరం ఉంద‌ని తెలిపారు. మ‌రోవైపు, మిలటరీలో పనిచేసే వైద్య సిబ్బందిలో వెయ్యి మందిని అత్యవసర సేవల కోసం న్యూయార్క్‌కు పంపించారు. వెంటిలేటర్లకు కొరత ఏర్పడడంతో న్యూయార్క్‌ నగరానికి చైనా వెయ్యి వెంటిలేటర్లను పంపింది. మొత్తం 17 వేల వెంటిలేటర్లు అవసరం ఉందని మేయర్‌ అంటున్నారు.  ఈ గ‌ణాంకాల‌ను చూస్తే.. అమెరికాలో ద‌య‌నీయ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: