క‌రోనా క‌రాళ నృత్యం స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనాకు అన్ని వ‌ర్గాలు ప్ర‌భావితం అవుతున్న త‌రుణంలో అన్న‌దాత‌లు ఇబ్బంది ప‌డ‌కుండా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ల మంత్రి కురసాల కన్నబాబు ఈ మేర‌కు ప్ర‌భుత్వ విధానాల‌ను వెల్ల‌డించారు.  రైతాంగానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. ఈ ఏడాది ధాన్యం చేతికొచ్చే సమయానికి కరోనా ముప్పు ఏర్పడిందన్నారు. అయినప్పటికీ రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరంలేదని భరోసానిచ్చారు. గ్రామ సచివాలాయల ద్వారా  గ్రామాల పరిధిలోనే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.  గ్రామ సచివాల యాల్లోని వ్యవసాయ సహాయకులకు రైతులు తమ వద్దనున్న ధాన్యం వివరాల్ని అందిస్తే చాలన్నారు. వాటిని సహాయకులు సేకరిస్తారన్నారు. రెండ్రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమౌతుందన్నారు. 

 

 

మార్కెట్‌ ధరకంటే రైతులెవరూ తమ ఉత్పత్తుల్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు.. దళారులకు తలొగ్గొద్దంటూ మంత్రి సూచించారు. వ్య‌వసాయ పనులకు కూలీల సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని రైతులకు మంత్రి సూచించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా తాము చేశామన్నారు. కోతలు పూర్తయిన ప్రాంతాల్నుంచి వరికోత యంత్రాల్ని కోతలు జరుగుతున్న ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా టమాటా కొనుగోళ్ళను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందన్నారు. మరో రెండ్రోజుల్లో అరటి కొనుగోలును ప్రారంభించనుందన్నారు. మామిడి కొనుగోలుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు. మొక్కజొన్నను మార్కెట్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. టమాటా రైతులు దళారులకు తమ పంటను అమ్ముకోవాల్సిన అవసరంలేదన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు టమాటాను తరలించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరటి ధర తీవ్రంగా పడిపోయిందన్నారు. కిలో నాలుగు రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితేర్పడిందన్నారు. రెండ్రోజుల్లో అరటి కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభిస్తామన్నారు. మామిడి ఎగుమతులకు పథకాల్ని సిద్దం చేస్తున్నామన్నారు. అనంతరం మామిడిని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొస్తుందన్నారు. మిర్చి, మొక్కజొన్న ఎగుమతులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 

 

కరోనాను రాష్ట్రంలో సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రాజీలేని ప్రయత్నాలు చేస్తోంద‌ని మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌ నేపధ్యంలో కూరగాయలకు ఎటువంటి ఇబ్బందిలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 36వేల క్వింటాళ్ళు సిద్దంగా ఉన్నాయన్నారు. వీటిని 101రైతు బజార్లు, 402 వికేంద్రీకరించిన రైతు బజార్లు, 242మొబైల్‌ రైతు బజార్లు, 925హోమ్‌ డెలివరీ పాయింట్లు, 38వేల కిరాణా దుకాణాల ద్వారా వినియోగదార్లకు అందుబాటులో ఉంచామన్నారు. అలాగే 25లక్షల లీటర్ల పాలు, 2.05కోట్ల కోడిగుడ్లు, 16,26,140మెట్రిక్‌ టన్నుల బియ్యం, 2,087 మెట్రిక్‌ టన్నుల పప్పులు, 4097మెట్రిక్‌ టన్నుల పంచదార సిద్దంగా ఉన్నాయన్నారు. ప్రతి రెండ్రోజులకు నిత్యావరాల ధరలపై జిల్లా యంత్రాంగాలు పర్యవేక్షణ జరుపుతున్నాయన్నారు. వైద్యపరమైన అంశాల్తో పాటు 29 వస్తువులు, చిన్న పిల్లల డైపర్లు, పాలపొడి కూడా అవసరమైన మేరకు సిద్దంగా ఉన్నాయన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: