తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాట నిల‌బెట్టుకున్నారు. రైతుల‌కు కీల‌క స‌మ‌యంలో ఇచ్చిన హామీని ఆయ‌న నిలుపుకొన్నారు. ఇందుకోసం ఏకంగా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీతో మాట్లాడారు. త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేసి స‌మ‌స్య ప‌రిష్కారానికి ఆయ‌న కృషి చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో వరికోతలు, ధాన్యం సేకరణపై సీఎం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 


‘లాక్‌డౌన్‌ కారణంగా జనజీవనం స్తంభించింది. అయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, వారు ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలుచేయాలని నిర్ణయించింది. మార్కెట్లలో రద్దీని నివారించడానికి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది.  వరికోతలు, ధాన్యంసేకరణ పూర్తిస్థాయిలో జరగాలి. వరికోతలకు రైతులు హార్వెస్టర్లు ఉపయోగించే పరిస్థితిని గ్రామాల్లో కల్పించాలి. హార్వెస్ట్‌ పరికరాలను బిగించే మెకానిక్‌లకు ప్రత్యేక పాసులిచ్చి అనుమతించాలి. స్పేర్‌పార్టులు అమ్మే షాపులను తెరవడానికి అనుమతివ్వాలి. గ్రామస్థులు తమ గ్రామాల్లోకి హార్వెస్టర్లను రానివ్వాలి. తర్వాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే వాహనాలకు అనుమతివ్వాలి. కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు ఒకేసారి రాకుండా చూడాలి. వారికిచ్చిన కూపన్లలో పేర్కొన్న తేదీ ప్రకారమే కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా రైతులను చైతన్యపరచాలి. కొనుగోలు కేంద్రాల వద్ద కావాల్సిన ఏర్పాట్లుచేయాలి. రైతుల దగ్గర్నుంచి చివరిగింజ వరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కాబట్టి రైతులెవరూ తొందరపడొద్దు’ అని ముఖ్యమంత్రి కోరారు. 

 


రాష్ట్రంలో గన్నీ బ్యాగులకు తీవ్ర కొరత ఉన్నది. గన్నీ బ్యాగులు తయారుచేసే పరిశ్రమలు పశ్చిమబెంగాల్‌లో ఉన్నాయి. ప్రతి ఏటా అక్కడి నుంచే బ్యాగులు వస్తాయి. ఈసారి లాక్‌డౌన్‌ కారణంగా బెంగాల్లో పరిశ్రమలు మూతపడటంతో గన్నీ బ్యాగులకు కొరత ఏర్పడింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఈ విషయంపై  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమబెంగాల్లో గన్నీ బ్యాగుల తయారీ పరిశ్రమలను తెరిపించాలని, గన్నీ బ్యాగులు రాష్ర్టాలకు చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను అనుమతించాలని అభ్యర్థించారు. దీనికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. రాష్ర్టానికి గన్నీ బ్యాగులు చేరుకునే విషయంలో సంబంధిత శాఖలతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాలసంస్థ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: