కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో ఏపీలో  అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 266 పాజిటివ్ కేసులు న‌మోదైన నేప‌థ్యంలో  లాక్‌డౌన్‌ అమలులో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ తదనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు.  పాజిటివ్‌ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ర్యాపిడ్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం, జలుబు, ఇతరత్రా  కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి శాంపిల్స్‌ను ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్‌ ఉన్నదీ తెలుసుకుంటున్నారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే.. ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా రెడ్ జోన్‌గా ప్రకటిస్తున్నారు. అనుమానితులు, పాజిటివ్‌ ప్రాంతాల్లో సర్వే మొత్తం పూర్తయ్యాక, అవసరాన్ని బట్టి ఇలాంటి చర్యలు  తీసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: