తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు కరోనా రోగులు ఆస్పత్రి నుంచి పారిపోతూ కొత్త చిక్కులు తెస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. 
 
కరోనా రోగి పారిపోవడం హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలతో జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆ వ్యక్తికి వైద్యులు గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో కరోనా రోగి ఆస్పత్రి నుంచి వైద్యుల కళ్లు గప్పి పరారయ్యాడు. పోలీసులు పారిపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
పోలీసులు పారిపోయిన వ్యక్తి కోసం హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలతో పాటు బాధితుడి స్వస్థలమైన గద్వాలలోను పోలీసులు గాలిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో రోగి మృతి చెందడంతో రోగి బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేయడంతో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రి దగ్గర భారీగా భద్రత పెంచింది. గాంధీ ఆస్పత్రి దగ్గర పోలీసులు ఉన్నా రోగి ఎలా తప్పించుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 334కు చేరింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినా ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువమంది ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారే అని సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: