క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేసేదాకా పోరాటం ఆగ‌దు.. ఇందుకు ప్ర‌జ‌లంద‌రూ క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ 40వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. క‌రోనాను ఓడించేదాకా సుదీర్ఘ‌పోరాటం చేస్తామ‌ని, ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌దిలిపెట్టే స‌మ‌స్యే లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. చాలా క‌ష్ట‌కాలంలో ఉన్నామ‌ని, అంద‌రం మ‌రింత ఆత్మ‌స్థైర్యంతో ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా.. సామాజిక దూరాన్ని పాటించాల‌ని, ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడ‌ల్లా ముఖానికి మాస్క్ ధ‌రించాల‌ని ఆయ‌న సూచించారు. ప్రతి బీజేపీ కార్యకర్త తన కుటుంబాన్ని, తన సమాజాన్ని సురక్షితంగా ఉంచుతారని ఆశిస్తున్నాన‌ని, అంద‌రం క‌లిసి విజ‌యం వైపు న‌డ‌వాల‌ని మోడీ పిలుపునిచ్చారు. ప్ర‌తీ ఒక్క‌రూ పీఎం కేర్స్ ఫండ్‌కు స‌హ‌క‌రించాల‌ని, ఒక్కొక్క‌రు మ‌రో 40మందిని చైత‌న్య‌ప‌ర్చాల‌ని బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం మ‌నం మాన‌వాళిని కాపాడ‌డానికి యుద్ధం చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. 

 

మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామ‌ని మోడీ పేర్కొన్నారు. దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అనేక రంగాల నిపుణుల‌తో క‌లిసి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని, దేశ ప్ర‌జ‌లు ఎంతో ఐక్య‌త‌ను చాటుతున్నార‌ని ఆయ‌న అన్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర‌వుతున్నా ప్ర‌జ‌లంద‌రూ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉంటున్నార‌ని, క‌రోనాను త‌రిమికొట్టేందుకు కంక‌ణం క‌ట్టుకున్నార‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. లాక్‌డౌన్ నేప‌థ్యాన్ని అర్థం చేసుకుంటూ స్వీయ‌నియంత్ర‌ణ పాటించి, ఈ ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా నిలిచార‌ని మోడీ కొనియాడారు. అయితే.. ప్ర‌ధాని మోడీ మాట‌ల్లో ఆంత‌ర్యం ఏమిట‌న్న‌దానిపై ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. క‌రోనాపై లాంగ్ ఫైట్ త‌ప్ప‌ద‌న్న మోడీ మాట‌లు ఒక విష‌యాన్ని చాలా స్ప‌ష్టంగా సూచిస్తున్నాయ‌ని, ఏప్రిల్ 14 త‌ర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తేసే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దేశ ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా సిద్ధం చేస్తున్నార‌ని, అందులో భాగంగానే ఈ విష‌యాల‌ను వెల్ల‌డించార‌ని చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: