మనుషుల నుంచి మనుషులకే వ్యాప్తి చెందుతుందని అనుకున్న కరోనా మహమ్మారి...ఇప్పుడు మనుషుల నుంచి జంతువులకు కూడా వైరస్ సోకుతోంది. ఒక మనిషి నుంచి పులికి కరోనా వైరస్ సోకిన విషయాన్ని తొలిసారిగా న్యూయార్క్ జూలో గుర్తించారు. జూలో ఉన్న మరికొన్ని పులులు, జంతువులు సైతం కొద్దిరోజులుగా నీరసించడంతో..వాటికి కూడా వైరస్ వ్యాపించిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

 

అమెరికాలో వచ్చిన కష్టం ఒకటైతే.. న్యూయార్క్ ఎదుర్కొంటున్న మరణవేదన మరొకటి. ఇక్కడ కరోనా విచక్షణారహితంగా ఊచకోత కోస్తోంది. ఇలాంటిచోట వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మనిషి నుంచి జూలో ఉన్న వన్యప్రాణులకు వైరస్ సోకిన విషయం బయటపడింది. న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూలో నిర్వహించిన పరీక్షల్లో అధికారులు ఈ అంశాన్ని గుర్తించారు. నదియా అనే నాలుగేళ్ల  మలయాన్ పెద్దపులికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ పెద్దపులితోపాటు మరో ఆరు టైగర్లు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాయి. అయితే వాటిల్లో వైరస్ లక్షణాలు కనిపించడం లేదంటున్నారు జూ సిబ్బంది. జంతు ప్రదర్శన శాలలో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా పెద్దపులికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. నదియా పెద్దపులితోపాటు ఉంటున్న అజుల్ అనే టైగర్‌, మరో రెండు పెద్ద పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలు పొడి దగ్గుతో బాధపడుతున్నాయని.. మరికొన్ని పులులు నీరసించాయని.. అవసరం అయితే వాటికి కూడా పరీక్షలు చేస్తామని జూ అధికారులు వెల్లడిస్తున్నారు. మత్తు ఇచ్చిన తర్వాత నదియా నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు పంపామని.. జ్వరం పెద్దగా లేదని అంటున్నారు. 

 

కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా మార్చి 16నే బ్రాంక్స్ జంతు ప్రదర్శనశాలను మూసివేశారు. మార్చి 27న తొలిసారిగా నదియా పెద్దపులిలో లక్షణాలు బయటపడ్డాయి. చికిత్స తర్వాత పులి కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత జూలోని ఇతర వన్య ప్రాణులను కూడా ఓ కంట కనిపెడుతున్నారు. ఇంతవరకూ మనుషులకు వైరస్ సోకితేనే ఎలా చికిత్స చేయాలో తెలియదు. మందు లేదు. అలాంటిది పులికి కరోనా రావడంతో జూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులను సవాల్ గా తీసుకుని వన్య ప్రాణులను కాపాడతామని చెబుతున్నారు.

 

జూలో ఉన్న పెద్దపులికే కరోనా వచ్చిందంటే.. ఇక ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా ఉండే కుక్కలు, పిల్లుల సంగతేంటి. వైరస్ సోకిన వారి ఇళ్లల్లో ఇలాంటి పెట్స్ ఉంటే  వాటికీ పరీక్షలు చేయాలా? అమెరికాలో కరోనా కల్లోలం రేపుతోన్నా.. ఇప్పటి వరకూ పెంపుడు జంతువులకు వైరస్ సోకిన ఉదంతాలు వెలుగు చూడలేదని అక్కడి వెటర్నరీ వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒక్క పెట్సే కాదు.. పాడి పరిశ్రమల్లో పనిచేసే వారికి వైరస్ సోకితే.. అక్కడ ఉండే ఆవుల పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకింది సరే.. జంతువుల నుంచి వైరస్ వ్యాపిస్తుందో లేదో ఇంకా తెలియదు. యానిమల్స్ వల్ల అమెరికాలో మహమ్మారి ప్రబలుతుందన్న ఘటనలూ లేవు.

 

ప్రస్తుతానికి అయితే జంతువులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చిందని అక్కడి అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ ఒక్క నదియా పెద్దపులిలో మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలిన కొత్తలో హాంకాంగ్ అధికారులకు పెట్స్ మీద అనుమానం వచ్చి పరీక్షలు చేశారు. పెంపుడు జంతువులకు వైరస్ వచ్చినా ఆందోళన చెందాల్సిన పనిలేదని.. వాటి నుంచి మనుషులకు వైరస్ సోకదని హాంకాంగ్ అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో కరోనా వైరస్‌ను జంతువులు ఎలా తట్టుకుంటాయి.. వైరస్ వ్యాప్తిలో వాటి పాత్రపై ప్యారిస్‌కు చెందిన ఒక సంస్థ పరిశోధనలు ప్రారంభించింది.

 

అమెరికాకు చెందిన పశువైద్య నిపుణులు మాత్రం ప్రజలకు ఒక సూచన అయితే చేశారు. కరోనా లక్షణాలు కనిపించినా.. పాజిటివ్ అని తేలినా పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని హితవు పలికారు. అలాగే జంతువులను తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, పెట్స్ ఉండే ప్రదేశాలను నీట్‌గా ఉంచాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: