గాంధీ ద‌వాఖాన నుంచి ఓ క‌రోనా రోగి ప‌రారీ అయ్యాడ‌ని, అత‌డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారంటూ ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. త‌బ్లిఘీ జమాత్‌కు వెళ్లి వ‌చ్చిన వారి నుంచి ఆ వ్య‌క్తి క‌రోనా సోకిందంటూ ఆ వార్త‌లో పేర్కొన్నారు. అయితే.. ఈ విష‌యం వైర‌ల్ కావ‌డంతో పోలీసు అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. వెంట‌నే ఈ ఘ‌ట‌న‌పై క్లారిటీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా సీఐ బాలగంగి రెడ్డి వివ‌రాలు వెల్ల‌డించారు. గాంధీ ద‌వాఖాన‌ నుంచి ఏ కరోనా రోగి కూడా పారిపోలేదన్నారు. గాంధీ ఆస్పత్రి నుంచి క‌రోనా రోగీ పరారీ అనే వార్తలో వాస్తవం లేదని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. అస‌లు ఏం జ‌రిగిందో ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆ రోగి బాత్ రూమ్‌కు వెళ్లే సమయంలో కనిపించకపోవడంతో తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్ర‌స్తుతం గ‌ట్టి పోలీస్ బందోబస్తు ఉందన్నారు. ఐసోలేషన్ వార్డు నుంచి ఏ రోగి కూడా తప్పించుకునే అవ‌కాశ‌మే లేద‌ని సీఐ చెప్పారు. కొంద‌రు కావాల‌నే రోగి పారిపోయడంటూ తప్పుడు ప్రచారం చేశార‌న్నారు. కరోనాపై ప్ర‌స్తుతం ప్రజల్లో తీవ్ర ఆందోళ‌న‌ నెలకొన్న వేళ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని చెప్పారు. 

 

నిజానికి.. కొద్దిరోజులుగా గాంధీ ఆస్ప‌త్రిలో భారీ బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల గాంధీ ఆస్ప‌త్రిలో వైద్య‌సిబ్బందిపై క‌రోనా పేషెంట్లు దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు పోలీసులు మ‌రింత అప్ర‌మ‌త్తం అయ్యారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్ర‌మ‌త్తంగా ఉంటున్నారు. ఇదిలా ఉండ‌గా.. క‌రోనా వైర‌స్‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్ద‌ని ఓ వైపు ప్ర‌భుత్వం, అధికారులుచెబుతున్నా.. కొంద‌రు ఆక‌తాయిలు మాత్రం మార‌డం లేదు. ఏదో ఒక‌చోట‌.. ఏదో ఒక‌రూపంలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి దుష్ప్ర‌చారం చేస్తున్న  వారిపై ఇప్ప‌టికే పోలీసులు కేసులు కూడా న‌మోదు చేస్తున్నారు. అయినా కూడా త‌మ ప‌ద్ధ‌తి మాత్రం మార్చుకోవ‌డం లేదు.  మరోవైపు తెలంగాణలో కొవిడ్‌-19 క‌ట్ట‌డికి అధికారులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ప్ర‌జ‌లు పాటించేలా మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: