దేశవ్యాప్తంగా పరీక్షలంటే వైద్యులకు కూడా ఇబ్బందే. వారి ఆరోగ్యం కూడా ముఖ్యమే. వైద్యులు, వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో జర్మనీ అనుసరించిన విధానం కూడా ఇతర దేశాలకంటే వినూత్నంగానే ఉంది. అంతేకాదు.. ఆర్థిక అసమానతలను పక్కన పెట్టి.. ప్రజలందరినీ ఒకేలా చూస్తూ.. వారికి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించడం, చికిత్సలు చేస్తోంది.

 

ఈ యజ్ఞంలో వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడకుండా.. వారికి కూడా ఎప్పటికప్పుడు జర్మనీలో పరీక్షలు చేస్తున్నారు. ఏప్రిల్‌ చివరి నాటికి  పెద్ద ఎత్తున యాంటీ బాడీ అధ్యయనం చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతివారం ర్యాండమ్‌గా లక్ష మంది నమూనాలు సేకరించాలని.. వారిలో రోగ నిరోధక శక్తిని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. పరీక్షలకు ప్రజలు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పని లేదు. ఈ వైరస్‌ను గుర్తించినప్పటి నుంచీ ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు.  వైద్య బీమా లేని వారికి ఎవరికైనా వైరస్‌ సోకినప్పుడు.. చికిత్సకు ఖర్చువుతుందని భయపడి ఆస్పత్రికి వెళ్లకపోతే ముప్పు ఎక్కువ అవుతుందని భావించడం వల్లే  కరోనా పరీక్షలను ఫ్రీగా చేస్తోంది జర్మనీ.

 

ప్రజల్లో వచ్చిన చైతన్యం కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఫిబ్రవరిలో ఓ కార్నివాల్‌కు వెళ్లిన  స్కూలు యజమాని ఒకరు.. అక్కడికి కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తులు వచ్చారని తర్వాత తెలుసుకున్నారు. తన స్కూళ్లో పనిచేస్తున్న వాళ్లను వెంటనే వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆ విధంగా ఎలాంటి లక్షణాలు లేని 22 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షా ఫలితాలు ఎలా ఉన్నా..  ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ వర్గాలు వెంటనే స్కూలు మూసివేయించి అందరనీ రెండు వారాల వరకూ ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించాయి. దాదాపు 235 మందికి పరీక్షలు నిర్వహించారు.  ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపించింది. అమెరికా వంటి దేశాలనే తీసుకుంటే.. అక్కడ అందుబాటులో ఉన్న వనరులను పరిగణనలోకి తీసుకుని కేవలం అనారోగ్యంతో ఉన్నవారికే పరీక్షలు చేస్తున్నారు. జర్మనీలో అలా కాదు.. ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా పరీక్షలు చేసి వారి డెటా దగ్గర పెట్టుకుంది. 

 

ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి కూడా ఉంది. కరోనా ప్రబలిన చైనాను కాకుండా.. ఈ వైరస్‌ సోకకుండా దక్షిణ కొరియా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో.. అక్కడి యాక్షన్‌ ప్లాన్‌ ఏంటో జర్మనీ ఫోకస్‌ పెట్టింది. అదే మోడల్‌ను అమలు చేసింది. కాకపోతే దక్షిణ కొరియా కంటే వేగంగా యాక్షన్‌ తీసుకుంది జర్మనీ. ఇన్ని చర్యలు.. ఇంత వేగంగా తీసుకున్నా.. జర్మనీ ఒక విషయంలో మాత్రం ఇప్పటికీ బాధపడుతోంది. ఆస్టియాలోని ఇష్‌ గుల్‌, స్కై రిసార్ట్స్‌ నుంచి వచ్చిన వారిని పక్కాగా గుర్తించి ఉంటే.. ఇవాళ ఈ స్థాయిలో దేశంలో వైరస్‌ ప్రభావం ఉండేది కాదని ఆవేదన చెందుతోంది.

 

కరోనా వైరస్‌ జర్మనీ మొత్తం వ్యాప్తి చెందకముందే గీస్సెన్‌లోని యూనివర్సిటీ ఆస్పత్రిలో వెంటిలేటర్స్‌తో కూడిని 173 ఇంటెన్సివ్‌ కేర్‌ బెడ్స్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇదే తరహాలో మరో 40 బెడ్స్‌ రెడీ చేసింది. వైద్య సిబ్బందిని పెంచారు. ఒక్క గీస్సెన్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లను పెంచారు. జనవరి నాటికి జర్మనీలో 28 వేల ఇంటెన్సివ్‌ కేర్‌తో కూడిన పడకలు ఉండేవి. అంటే లక్ష మందికి 34 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అదే ఇటలీలో చూసుకుంటే లక్ష మందికి 12, నెదర్లాండ్స్‌లో 7 చొప్పున ఉన్నాయి. ప్రస్తుతం జర్మనీ దగ్గర 40వేల ఇంటెన్సివ్‌ కేర్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పరిస్థితిపై ఒక అవగాహన రావడంతో ఇప్పుడు జర్మనీ వాళ్లకే కాదు.. ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ నుంచి వస్తున్న కరోనా బాధితులకు కూడా చికిత్స చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కరోనా ఇంటెన్సివ్‌ కేర్‌ ట్రీట్‌మెంట్‌లో జర్మనీ చాలా బలంగా కనిపిస్తోంది.


కరోనాపై యుద్ధం విషయంలో జర్మనీ ప్రజల సంఘటిత స్పందనకు మరో కారణం కూడా ఉంది. జర్మనీ ఛాన్స్‌లర్‌  ఏంజిలా మార్కెల్‌. ఆమె నాయకత్వాన్ని... ఆమె చేసిన సూచనలను మరో మాట లేకుండా దేశ ప్రజలు పాటించారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని మార్కెల్‌ చేసిన సూచన బ్రహ్మవాక్కుగా పనిచేసిందని చెప్పాలి. సామాజిక దూరం పాటించాలని అనగానే అదే చేశారు. విపక్ష పార్టీలు మారు మాట్లాడలేదు. ఈ విపత్కర సమయంలో జర్మనీకి మార్కెలే బలమయ్యారని భావిస్తున్నారు అక్కడి వైద్యులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: