అంతకంతకూ వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి జపాన్‌ కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందా? నేడో, రేపో ప్రధాని షింజో అబే కీలక ప్రకటన చేయబోతున్నారా? మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానిపై ఒత్తిడి పెరుగుతోందా? 

 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించినట్లు కనిపిస్తున్నా.. జపాన్‌ను ఎక్కడో భయం వెన్నాడుతోంది. ఇప్పటి వరకూ జపాన్‌లో 3వేల ఆరువందలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా రాజధాని టోక్యోలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెయ్యికిపైగా కరోనా  బాధితులు ఒక్క టోక్యో నగరంలోనే ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి చర్యలైనా తీసుకునేలా ప్రధాని షింజో అబేకు పార్లమెంట్‌ అధికారాలు కట్టబెట్టింది. ప్రస్తుతం చాలా వరకూ ఆంక్షలు విధించినా.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో అవి సరిపోవడం లేదనే భావన అక్కడ పాలకులు, ప్రజల్లో కనిపిస్తోంది. దీంతో మరిన్ని కఠిన నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలని ప్రధాని అబేపై ఒత్తిడి తీవ్రమవుతోంది.

 

టోక్యో వర్గాల సమాచారం ప్రకారం  రెండు రోజుల్లోనే ప్రధాని అబే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తారని సమాచారం. ఆరు నెలలపాటు అమలులో ఉండే విధంగా అత్యవసర పరిస్థితి విధిస్తారని భావిస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలో ఉండే నిబంధనలు, ఆంక్షలపై కూడా స్పష్టమైన ప్రకటన ఉంటుందని అనుకుంటున్నారు. అమెరికా, చైనా, ఇతర యూరోపియన్‌ దేశాలతో పోల్చుకుంటే జపాన్‌లో పరిస్థితి విషమంగా లేకపోయినా.. ఏదీ తేలికగా తీసుకోవడానికి పాలకులు సిద్ధంగా లేరు.  అగ్రరాజ్యాలలో కరోనా మరణాలు వేల సంఖ్యలో ఉన్నాయి. జపాన్‌లో కట్టుదిట్టమైన చర్యల కారణంగా మరణాల సంఖ్య వంద కూడా దాటలేదు. కానీ.. ఆయా దేశాలలో తొలుత ఇలాగే కనిపించినా తర్వాత పరిస్థితి చేయిదాటిపోయిందనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అలాంటి స్థితి జపాన్‌కు రాకుండానే ముందు జాగ్రత్త పడాలనే ఆలోచనలో ఉన్నారు.

 

వైరస్‌ మరింత వ్యాప్తి చెందితో అది ప్రజల జీవనంతోపాటు దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే కరోనా వైరస్ తీవ్రత పెరిగితే దేశంలో ఎమర్జెన్సీ విధించేందుకు ప్రధానికి అధికారం కట్టబెడుతూ మార్చిలోనే అక్కడి పార్లమెంట్‌ తీర్మానం చేసింది. ఇప్పటికే జపాన్‌లో ప్రజలు సామాజిక దూరం పాటించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ ప్రకటిస్తే మాత్రం ప్రజలను ఇళ్లు విడిచి బయటకు రానివ్వరు. వ్యాపారాలు మూతపడతాయి.  అయితే ఈ చర్యలు ఇతర దేశాల్లో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ మాదిరి తీవ్రంగా ఉండకపోవచ్చునని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతోంది. దేశం మొత్తం ఎమర్జెన్సీ విధిస్తారా లేక.. రాజధాని టోక్యోతోపాటు మరో రెండు ముఖ్య నగరాలైన ఒసాకా, హ్యూగోలకే పరిమితం చేస్తారా అనేది స్పష్టత లేదు. ఎమర్జెన్సీ ప్రకటనపై ఇప్పటికే ఆలస్యం చేశారని.. అదే ముందే చర్యలు తీసుకుని ఉంటే జపాన్‌ ఇంకా మెరుగైన స్థితిలో ఉండేదని కొందరు వాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: