అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. న్యూయార్క్ లో ప్రతి రెండున్నర నిమిషాలకో మరణం నమోదవుతుంది. అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 10 వేలకు చేరువైంది. చైనా నుంచి అమెరికా వచ్చినవారి వల్లే కరోనా విస్తరించిందని లెక్కలు చెబుతున్నాయి. 

 

అమెరికాలో కరోనాకు కేంద్ర బిందువుగా ఉన్న న్యూయార్క్‌ రాష్ట్రంలో ఈ వైరస్‌ అడ్డూఆపు లేకుండా ఊచకోత కోస్తోంది. ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో 630 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వారం పాటు ఇక్కడ కొవిడ్‌-19 తాకిడి పెరుగుతూనే ఉంటుందని తెలిపారు. న్యూయార్క్‌ రాష్ట్రంలో ఏప్రిల్‌ 2-3 మధ్య రికార్డు స్థాయిలో 562 మంది కరోనాతో మరణించారు. ఆ తర్వాత గడిచిన 24 గంటల్లో ఈ మరణాల సంఖ్య 630కి చేరింది దీంతో కొవిడ్‌-19తో ఇక్కడ బలైనవారి సంఖ్య 3,565కు చేరింది.

 

 దేశంలోనే అత్యధికంగా కరోనా మహమ్మారి బారిన పడ్డ రాష్ట్రం న్యూయార్కే. దేశం మొత్తం మీద చోటుచేసుకున్న కేసుల్లో మూడో వంతు ఇక్కడే వెలుగు చూశాయి. ఆ తర్వాతి స్థానంలో న్యూజెర్సీ ఉంది. రాష్ట్రంలో అత్యవసర వైద్య సాధనాలు, వైద్య నిపుణుల కొరత నెలకొనడంపై గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మాస్కులు, గౌన్‌లు, లభించడంలేదన్నారు. 17వేల వెంటిలేటర్ల కోసం ఆర్డరిచ్చామని తెలిపారు. అయినా సరిపడా సరఫరా లేదన్నారు. 

 

కొవిడ్‌-19 అతిపెద్ద మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తోంది. చనిపోయిన తమ వారి పార్థివ దేహాన్ని పట్టుకొని గుండెలవిసేలా రోదించే అవకాశాన్నీ ఇవ్వడంలేదు. అయినవారిని కోల్పోయి, పుట్టెడు దుఖంలో ఉన్న వారిని అక్కున చేర్చుకొని ఓదార్చే వీలునూ బంధుమిత్రులకు కల్పించడంలేదు. కడుపు తరుక్కుపోయేలా చేసే ఈ దృశ్యాలు ఇప్పుడు అమెరికాలో నలుమూలలా కనిపిస్తున్నాయి.

 

అయితే అమెరికాలో లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవడానికి చైనా నుంచి వచ్చినవారే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. జనవరి మొదటి రెండు వారాల్లో చైనా నుంచి ముఖ్యంగా వుహాన్ నుంచి చాలా మంది యూఎస్ లో ప్రవేశించారని, వీళ్లే కరోనాను వ్యాప్తి చేశారని చెబుతున్నారు. మొదట్లో అమెరికా వైరస్ స్క్రీనింగ్ పై శ్రద్ధ పెట్టకపోవడం కూడా కొంప ముంచింది. తర్వాత కూడా లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టుల్లో మాత్రమే థర్మల్ స్క్రీనింగ్ చేశారు. మిగతా ఎయిర్ పోర్టుల్లో చెకింగ్ లేకపోవడంతో.. చైనా వాసులు ఈజీగా యూఎస్ లో ప్రవేశించి.. కరోనాను వ్యాప్తి చేశారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: