ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారా లేక‌పోతే వివాదంలో చిక్కుకుంటున్నారా అర్థం కాని ప‌రిస్థితి. కానీ ఆయ‌న కామెంట్లైతే...ఊహించ‌ని రీతిలో వివాదానికి కార‌ణంగా మారుతున్నాయి. తాజాగా చంద్ర‌బాబు నిర్వ‌హించిన‌ విలేక‌రుల స‌మావేశం, అందులో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఈ ప్ర‌స్తావ‌న‌ను తెర‌మీద‌కు తెస్తున్నాయి. 

 

 


హైద‌రాబాద్‌లో ఉన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల విష‌యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాస్తవాలు దాచకూడదని అన్నారు. కరోనా మహమ్మారి వల్ల అందరూ బాధపడుతున్నారని, దీంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని చెప్పారు. ‘‘ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో అత్యధికంగా ఒక్క వారంలో వెయ్యి శాతానికి పైగా కరోనా పెరిగింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పివారిని మరింత సమాయత్తం చేయాలి. ప్రజలు కూడా ప్రభుత్వాల సూచనలు పాటించాలి.` అని సూచించారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న‌ప‌లు కామెంట్లు కూడా చేశారు.  

 

 

కేంద్రం నుంచి డబ్బులు వస్తే వైసీపీ వాళ్లు ప్రచారం చేసుకోవడమేంటి అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ``స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేయడం దారుణం. సరైన సమయంలో క్వారంటైన్ చేసి ఉంటే కేసులు పెరిగి ఉండేవి కాదు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడం సరికాదు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లడంతో అమెరికాకు నష్టం జ‌రుగుతోంది. ట్రంప్ అసమర్థత చూసైనా జగన్ కళ్లు తెరవాలి.`` అంటూ అటు అమెరికా అధ్య‌క్షుడికి...ఇటు ఏపీ సీఎంకు చంద్ర‌బాబు లింక్ పెట్టారు.

 

కాగా, చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం నేప‌థ్యంలో ఏపీ రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ కరోనా నియంత్రణలోను, కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ సూచనలను ప్రజలందరూ పాటిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు, ఉద్యోగులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి వల్ల మిగిలిన రాష్ర్టాలతో పోలిస్తే కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ముందుందని ఆయ‌న వివ‌రించారు. లాక్ డౌన్ చేస్తూ కేంద్రం చెప్పిన నిర్ణయాలకంటే ముందే ఏపీ రాష్ర్టం అంతా కూడా లాక్ డౌన్ చేయాలని నిర్ణయించింద‌ని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: