కరోనా వైరస్‌ సృష్టిస్తున్న బీభత్సంతో జన నష్టమే కాదూ.. ఆర్థిక నష్టమూ పెద్ద ఎత్తున వాటిల్లుతున్నది. ముఖ్యంగా భారత్‌కు కరోనా సెగ గట్టిగానే తగులుతున్నది. అసలే ఆర్థిక మందగమనంతో అల్లాడిపోతున్న దేశ ఆర్థికవ్యవస్థను ఈ మహమ్మారి ఏకంగా మాంద్యంలోకి పడేసింది. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌.. ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నా.. అన్ని రంగాలను నష్టాల ఊబిలోకి నెట్టింది. దీంతో వ్యయ నియంత్రణపై దృష్టి పెడుతున్న సంస్థలు.. భారీ ఎత్తున ఉద్యోగాలను ఎత్తివేయాలనుకుంటున్నాయి. అవును.. వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఇదే తేలింది. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన సంస్థల్లోని సుమారు 200 మంది సీఈవోలు పాల్గొన్నారు. ఇందులో 52 శాతం మంది లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగ కోతలు ఉంటాయన్నారు. జనవరి-మార్చి త్రైమాసికంలో ఆదాయం, లాభాలు పెద్ద ఎత్తునే పడిపోవచ్చన్న అంచనాలున్నాయి. ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని మెజారిటీ సీఈవోలు అంటున్నారు. 

 


లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు మొత్తంగా వ్యయ నియంత్రణ చర్యలు ఉంటాయని తాజా సర్వేలో మెజారిటీ సీఈవోలు సంకేతాలిచ్చారు. అయినప్పటికీ 47 శాతం సీఈవోలు.. ఉద్యోగాల్ని కోల్పోయేవారు 15 శాతం దిగువనే ఉండొచ్చనగా, 32 శాతం సీఈవోలు మాత్రం 15-30 శాతంగా ఉండొచ్చని చెప్తున్నారు. స్థూలంగా దాదాపు 52 శాతం సంస్థలు లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగాల తీసివేతలు ఉంటాయని చెప్పేస్తున్నట్లు సీఐఐ తెలిపింది. దీనివల్ల జీడీపీ చాలావరకు తగ్గిపోవచ్చని హెచ్చరించింది. నిరుద్యోగం పెరిగితే మార్కెట్‌లో డిమాండ్‌ పడకేస్తుందని, ఫలితంగా ఉత్పత్తి కుదేలై మొత్తం ఆర్థికవ్యవస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్నది. దీంతో రాబోయే ఉద్యోగ కోతల్ని తేలిగ్గా తీసుకోలేమని వ్యాఖ్యానించింది.

 

కాగా, దేశవ్యాప్తంగా క‌రోనా వైరస్‌ విజృంభించడంతో గత నెలలో ఎఫ్‌పీఐలు  ఏకంగా లక్ష కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. తాజాగా డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారం మేరకు మార్చిలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.61,793 కోట్ల నిధులను తరలించుకుపోయిన ఎఫ్‌పీఐలు.. బాండ్‌ మార్కెట్ల నుంచి రూ. 56, 211 కోట్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం గా రూ.1,18,184 కోట్లను తరలించుకుపోయినట్లు అయింది. సెప్టెంబర్‌ 2019 నుంచి వరుసగా ఆరు నెలలుగా వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు గత నెలలో వెనక్కితీసుకున్నారు. ఒక నెలలో ఇంతటి గరిష్ఠ స్థాయిలో వెనక్కితీసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుత నెలలో జరిగిన రెండు సెషన్లలోనే రూ.6,735 కోట్ల నిధులను తరలించుకుపోయారు. వీటిలో ఈక్విటీల నుంచి రూ.3,802 కోట్లు, డెబిట్‌ మార్కెట్ల నుంచి రూ.2,933 కోట్లు. కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో ఎఫ్‌పీఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గుచూపారని మార్నింగ్‌ స్టార్‌ హెడ్‌ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: