ఒకవైపు కరోనా వైరస్ తగ్గిందని భావిస్తుంటే మరోవైపు కొత్తగా కేసులు బయటపడుతున్నాయి. ఇదెక్క‌డో కాదు...రాక్ష‌స వైర‌స్‌ను సృష్టించిన‌  చైనాలోనే. ఔను క‌రోనా కరాళ నృత్యం వ‌ల్ల‌ ల‌క్ష‌ల మంది బాధితుల‌వ్వ‌గా..వేల‌ల్లో ప్రాణాలు కోల్పోయారు.  చైనాలో 81,669 మందికి కరోనా సోకగా వీరిలో 3,329 మంది మరణించారు. అయితే కరోనా వైరస్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌నుకుంటున్న త‌రుణంలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ రోజు కొత్తగా 39 మందికి కరోనా వైరస్ సోకిందని తేలింది. ఈసారి కరోనా వ్యాధి లక్షణాలు లేకున్నా టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని వస్తుండటంతో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. అయితే, గతంలో ఉన్నంత‌ వ్యాప్తి ఇప్పుడు లేద‌ని అక్క‌డి అధికారులు చెప్తున్నారు. చైనాలో క‌రోనా తిరిగి విస్త‌రించ‌డం గురించి త‌న విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే.

 

కాగా, ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి ఏప్రిల్ చివ‌రి నాటికి త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని చైనా శాస్త్ర‌వేత్త ఝూంగ్ న‌న్షాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకు చైనా, ఇట‌లీ ఘ‌ట‌న‌లే కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చారు. ఇట‌లీలో మొద‌ట‌గా వేగంగా విస్త‌రించిన క‌రోనా ఇప్పుడు పెరుగుద‌ల‌లో త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని చెప్పారు. ఇటలీ తర్వాత వ్యాపించిన అమెరికాలో... ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయ‌ని, రానున్న రోజుల్లో వాటి పెరుగుదలలో తగ్గుదల మొదలవుతుంద‌ని చెప్పారు. ఇక‌ అమెరికా తర్వాత కరోనా వ్యాపించిన ఇండియాలో ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతూ... ఏప్రిల్ చివరి నాటికి...  కంట్రోల్ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కాస్త అటూ ఇటుగా ఏప్రిల్‌ నెలాఖరుకల్లా  కంట్రోల్ అవుతుందని ఝాంగ్ నన్షాన్ అంచ‌నా వేస్తున్నారు. ఇక కరోనా వైరస్ నానాటికీ బలహీనం అవుతుంద‌ని..చైనాలో మ‌ళ్లీ విజృంభించే అవ‌కాశ‌మే లేద‌న్నారు. 

 

అయితే,  అమెరికాలోని భారత సంసతి న్యాయవాది రవి బాత్రా మాత్రం చైనాలోని ప‌రిణామాల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.  న్యూయార్క్ లో నివసించే బాత్రా, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నారు.కరోనా కోరల నుంచి బయటపడ్డ మీడియాతో మాట్లాడుతూ కరోనాకు సంబంధించిన పచ్చినిజాలు చైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగైతేనే శాస్త్రవేత్తలు, వైద్యులు ఏదైనా పరిష్కారం కనిపెట్టగలరని ఆయన అన్నారు. టీకా కనిపెట్టేంత వరకు ఎవరూ బయటకు వెళ్లలేరని చెప్పారు.  చైనా గుట్టు విప్పితే అప్పుడే మన హీరో ఆంథోనీ ఫాసీ (అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య సలహాదారు) వీలైనంత త్వరలో టీకాను కనుగొంటారని పేర్కొన్నారు. మృత్యువుతో కరచాలనం చేసి వచ్చాను కదా.. ఏదైనా మంచిపని చేయాలని అనుకుంటున్నాను - అని బాత్రా అన్నారు. టీకా కనిపెట్టేంత వరకు ఎవరూ పనికి వెళ్లలేరు.. ఆటలాడలేరు.. బడికి కూడా పోలేరు.. మనకు తెలిసిన జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు చచ్చిపోయాయి. కోలుకునే సూచనలు కూడా లేవు - అని ఆయన పీటీఐ వార్తాసంస్థకు చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: