క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటూనే ఏపీ ప్ర‌భుత్వం మ‌రో ముందడుగు వేసింది. ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ కోవిడ్ -19 చికిత్స కేసులను ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. కరోనా బాధితులకు ప్రైవేట్ ద‌వాఖాన‌ల్లోనూ ఈ పథకం కింద కొవిడ్‌-19కు చికిత్స ఇచ్చేలా ఆదేశించింది. ఆ వెంట‌నే కోవిడ్ -19 కు సంబంధించిన 15 రకాల ప్రొసీజర్స్ ను కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చింది. దీంతో ఏపీ ప్ర‌జ‌లు చాలా సంతోష‌సం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి, చికిత్స కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న ముంద‌స్తు చ‌ర్య‌ల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఏపీలో క‌రోనా ప్ర‌భావం కొంత‌మేర‌కు తీవ్రంగానే క‌నిపిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 303కు చేరింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా మరో 51 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 303కు చేరింది. 

 

ఇందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే క‌రోనాప్ర‌భావం తీవ్రంగా క‌నిపిస్తోంది. జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 74కు చేరింది. రాష్ట్రం మొత్తం మీద నమోదైన కేసుల్లో 25 శాతం ఈ జిల్లాలోనివే కావడం గమనార్హం. దీంతో కర్నూలు జిల్లాలో హైఅలెర్ట్‌ ప్రకటించారు. ఇక సోమవారం నెల్లూరు జిల్లాలో 8 కేసులు, పశ్చిమ గోదావరిలో 6, విశాఖలో 5, కడపలో 4, అనంతపురంలో 3, గుంటూరులో 2, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 303 కేసుల్లో 23 కేసులు తప్ప మిగిలిన 280 కేసులు ఢిల్లీ మ‌ర్క‌జ్ జమాత్‌కు వెళ్లివచ్చిన వారితో సంబంధాలున్నవేనని ప్ర‌భుత్వం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి ఆరుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఏపీలోని ఏడుజిల్లాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా రెడ్ జోన్‌లో చేర్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: