ఇప్పుడు అంద‌రి చూపు లాక్‌డౌన్ పైనే. మ‌రో వారంలో ముగియ‌బోతున్న(!) లాక్‌డౌన్ గురించి కాదు... ఈ సామాజిక బందీఖానాను పొడ‌గిస్తారా?  పొడ‌గించర‌? ప‌్ర‌జ‌ల ఆకాంక్ష‌లు స‌రే...ఇంత‌కీ క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కోణంలో ఏది క‌రెక్టు అనే సందేహాలు ఎంద‌రిలోనో ఉన్నాయి. ఇలాంటి త‌రుణంలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లాక్‌డౌన్ కొన‌సాగించాల‌ని ఆయ‌న సూచించారు. ప‌లు నివేదిక‌లు సైతం ఇదే మాట చెప్తున్నాయ‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు కూడా. అయితే, కేంద్రం సైతం ఇదే మూడ్‌లో ఉంది.

 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్ర కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్ మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జీతభత్యాల్లో కోతలు కేవలం ఎంపీలు, మంత్రులకే కాదని, భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ల వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ జీతాల్లోనూ 30 శాతం కోత విధించేందుకు సమ్మతించారని మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ వెల్లడించారు. తమంతట తాము ఈ నిర్ణయం తీసుకుని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగా లౌక్‌డౌన్‌ గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌ జవాబిస్తూ, లాక్‌డౌన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్త పరిణామాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు. ప్రజలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని జ‌వ‌డేక‌ర్  వెల్లడించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స‌న్నిహితుడ‌నే పేరున్న జ‌వ‌డేక‌ర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు లాక్‌డౌన్ పొడ‌గింపున‌కు తార్కాణ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. 

 

సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ``ఇపుడు లాక్‌డౌన్‌ ఎత్తేస్తే ఆగమైతం. 21రోజుల లాక్‌డౌన్‌తో నిష్టగా ఉండి చేసిందంతా గంగలో కలుస్తది. గేట్లు ఎత్తేస్తే ఎవర్ని ఎవరం ఆపలేం. లాక్‌డౌన్‌ వల్ల ఆదాయం తగ్గినా మరణాల్లేవు. మన దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి లాక్‌డౌన్‌ తప్ప మరో గత్యంతరం లేదు. నేను ప్రధాని మోడీ గారికి ఇప్పటికే చెప్పిన. మళ్ళీ చెబుతున్న. మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నా`` అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: