దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్నమొన్నటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వాళ్లే బాధితులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు స్థానికులకూ జోరుగా వ్యాపిస్తోంది. దీంతో వ్యాధి వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రఖ్యాత ఎయిమ్స్‌ సంస్థ. రెండు దశలు దాటి మూడో దశలోకి వ్యాధి ప్రవేశించిందని ప్రకటించింది. ఈ దశలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పెను ప్రమాదం తప్పదని హెచ్చరించింది.

 

దేశవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం సాయంత్రం నాటికి వ్యాధి సోకిన వారి సంఖ్య 4 వేల 281కి చేరింది. గడిచిన 24 గంటల్లో 704 కేసులు నమోదయ్యాయంటే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 1445 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి.

 

మరోవైపు వ్యాధి ఇదే స్థాయిలో విజృంభిస్తే పెను ప్రమాదం తప్పదని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - AIIMS వెల్లడించింది. దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ రెండో దశ దాటి మూడో స్టేజ్‌లోకి ప్రవేశించిందని తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇది కొన్ని ప్రాంతాల్లోనే ఉందని చెప్పడం సంతోషించదగ్గ పరిణామం. 

 

విదేశాల నుంచి వచ్చిన వారికి వ్యాధి సోకితే మొదటి దశగానూ, వారి నుంచి వారి సంబంధీకులకు వైరస్ వ్యాపిస్తే రెండో దశగానూ భావించాం. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌.. అంటే స్థానికుల ద్వారా వ్యాధి మరికొందరికి సోకితే దాన్ని మూడో దశగా భావించాలి. మర్కజ్‌ ప్రార్థనలకు హాజరై వచ్చిన వాళ్ల నుంచి పలువురికి వ్యాధి సోకడంతో ప్రస్తుతం దేశంలో వ్యాధి మూడో దశలోకి ప్రవేశించింది. ఇది మరింత విస్తరిస్తే పెను ప్రమాదం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లిన వచ్చిన వారిలో ఎక్కువ మందిని ఇప్పటికే గుర్తించారు. వారందరినీ గుర్తించడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అయినా వారిని ట్రేస్‌ చేయడంలో సక్సెస్ అయింది. అయితే ఇప్పటికీ కొందరు అజ్ఞాతంలోనే ఉన్నారు. ఒకవేళ వారికి వ్యాధి లక్షణాలుంటే అది మరికొంతమందికి సోకే ప్రమాదం లేకపోలేదు. అందుకే అలాంటి వాళ్లంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఎయిమ్స్ సూచించింది.

 

అయితే మూడో దశ దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. దీన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ చైన్ ప్రాసెస్‌కు వీలైనంత త్వరగా చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీని నుంచి త్వరగా బయటపడితే తప్ప వ్యాధి నుంచి కోలుకున్నట్లు భావించడానికి వీల్లేదు. ప్రజలంతా సహకరించినప్పుడే వైరస్ కట్టడి సాధ్యమవుతుందని ఎయిమ్స్‌ స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌పై ఏప్రిల్ 10 తర్వాతి పరిస్థితులను బట్టి నివేదిక సమర్పిస్తామని వెల్లడించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: