యూరోప్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యూకేల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ అత్యంత కష్టకాలంలో ఉందని జర్మనీ చాన్స్‌లర్ మెర్కల్ వెల్లడించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడం తమ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అని చెప్పారు. 

 

యూరోప్‌లో అత్యధికంగా మరణాలు ఫ్రాన్స్‌లోనే నమోదవుతున్నాయి. సోమవారం ఫ్రాన్స్‌లో 833 మంది చనిపోయారు. 24 గంటల్లో ఆ దేశంలో అత్యధిక మరణాలు నమోదైంది నిన్ననే. దీంతో కరోనా కారణంగా ఫ్రాన్స్ లో మరణాల సంఖ్య 9 వేలకు సమీపిస్తోంది. నిన్న ఐదు వేలకు పైగా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు లక్షకు చేరువవుతున్నాయి. 

 

ఇటలీలోనూ నిన్న భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. 3 వేల 5 వందల 99 కేసులు పెరగడంతో... ఆ దేశంలో మొత్తం బాధితుల సంఖ్య లక్షా 32 వేల 547కి చేరింది. ఇక సోమవారం 636 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా మొత్తం 16 వేల 5 వందల 23 మంది వైరస్‌కు బలయ్యారు. ఇంకా దాదాపు నాలుగు వేల మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే గతవారంతో పోలిస్తే.. కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గడం ఇటలీ ప్రభుత్వ వర్గాలకు ఉపశమనం కలిగిస్తోంది.

 

స్పెయిన్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే స్పెయిన్‌లో 3 వేల 3 వందల 86 కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తంగా స్పెయిన్‌లో ఇప్పటివరకు లక్షా 35 వేల 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో  528 మంది చనిపోయారు. మొత్తంగా స్పెయిన్‌లో 13 వేల 169 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

అటు జర్మనీలో కూడా కరోనా ఉధృతి పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. తాజాగా ఒక వెయ్యి 901 కేసులు నమోదు కాగా, 111 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా జర్మనీలో 16 వందల 95 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం జర్మనీ సహా అన్ని దేశాలు అతిపెద్ద ఛాలెంజ్ ను ఎదుర్కొంటున్నాయని జర్మనీ చాన్సలర్ మెర్కల్ చెప్పారు. ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్.. ఇంత పెద్ద సంక్షోభాన్ని చూడలేదని ఆమె అన్నారు.

 

బ్రిటన్‌లోనూ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 3 వేల 8 వందల 2 పాజిటివ్ కేసులు తేలాయి. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 51 వేల 6 వందల 8కి చేరుకుంది. నిన్న ఒక్క రోజే 4 వందల 39 మంది చనిపోగా... మొత్తం 5 వేల 3 వందల 73 మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో వైద్య సదుపాయాల కొరతను తీర్చడానికి.. విమానాల్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు.

 

ఇక నెదర్లాండ్స్‌లో మొత్తం 18 వేల 803 మందికి వైరస్ సోకింది. సోమవారం  952 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు నెదర్లాండ్స్‌లో మృతి చెందిన వారి సంఖ్య  18 వందల 67 కి చేరింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 101 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

బెల్జియంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజే 11 వందల 23 మందికి వైరస్ సోకింది. మొత్తంగా 20 వేల 814 మందికి వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో 185 మంది మృతి చెందారు.  ఇప్పటి వరకు వైరస్ బారిన పడి మొత్తంగా  16 వందల 32 మంది చనిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: