కరోనా చాలా మంది ఉద్యోగాలకు ఎసరు పెట్టబోతోందా? ముఖ్యంగా ఐటీ రంగంలో ప్రకంపనలు తప్పవా? ఉపాధి కోల్పోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటుందనే అంచనాలు కరెక్టేనా? కరోనా వల్ల ఎందుకు ఉద్యోగాలు ఊడతాయ్‌? 

 

కరోనావల్ల విధించిన లాక్‌డౌన్‌తో దేశం స్తంభించింది. పనుల్లేవు.. కంటినిండా నిద్రలేదు. అందరిలోనూ ఒక్కటే ఆందోళన. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కానీ.. కరోనా వైరస్‌ కట్టడి అయిన తర్వాతగానీ అనేక రంగాలతోపాటు ఉద్యోగ, ఉపాధి అంశాలాలో పెను మార్పులు చోటు చేసుకుంటాయనే ఆందోళన పెరుగుతోంది. వచ్చే మూడు నుంచి ఆరునెలల కాలంలో మనదేశంలోనే  లక్షన్నర ఐటీ జాబ్‌లు పోతాయనేది అంచనా. చిన్న చిన్న ఐటీ కంపెనీలు మనుగడ సాధించలేవని.. ఫలితంగా వాటిల్లో పనిచేస్తున్నవారు ఉపాధి కోల్పోక తప్పదని అనుమానిస్తున్నారు. భారత్‌లోని ఐటీ రంగంలో దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇందులో చిన్న ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న వారి సంఖ్యే 10 లక్షల నుంచి 12 లక్షల వరకూ ఉంటుంది. దేశంలో టాప్‌ ఫైవ్‌గా ఉన్న ఐటీ  కంపెనీలలోనే దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు.

 

కరోనా వైరస్‌ వెలుగు చూసిన తర్వాత ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువ. పైగా ట్రావెల్‌, ఆతిథ్య రంగాలు పూర్తిగా మూతపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. తయారీ రంగం కూడా కుదేలైంది. వచ్చే త్రైమాసికంలో ఫలితాలు, రాబడి దారుణంగా ఉండొచ్చని కంపెనీలు ఇప్పటికే  తమ పెట్టుబడిదారులను హెచ్చరించాయి. మనదేశంలో లాక్‌డౌన్‌ ఈ నెల 14 వరకూ ఉంటుంది. చాలా దేశాలు మే చివరి వరకూ ఆంక్షల్ని పొడిగించాయి. ఐటీ రంగానికి ఇది ఏ మాత్రం సానుకూల సమాచారం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లక్షన్నర మంది ఐటీ ఉద్యోగుల జాబ్స్‌ పోతాయనేది ప్రాథమిక అంచనా మాత్రమే. అన్నీ కుదురుకున్న తర్వాత చూస్తే.. ప్రతికూల ప్రభావం ఇంకా ఎక్కువ ఉండొచ్చన్నది కొందరి వాదన.

 

ఇప్పటికే చిన్న సంస్థలు లే ఆఫ్‌లు ప్రకటించేశాయి. ఇలాంటి నిర్ణయాల ద్వారా భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఉద్యోగులకు సంకేతాలు ఇస్తున్నాయి. ట్రావెల్‌ ఇండస్ట్రీపై ఆధారపడి సేవల గురించి వివరించే బీపీవోలు లే ఆఫ్‌ పేరుతో  దాదాపు 300 మంది ఉద్యోగులకు షాక్‌ ఇచ్చాయి.  అయితే ఐటీ ఉద్యోగుల సంఘాలు ఇలాంటి చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చాలా కంపెనీలు రెండు నెలల ముందస్తు నోటీసులు ఇచ్చి ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. లే ఆఫ్‌లు ప్రకటించే జాబితాలో మరిన్ని కంపెనీలు చేరతాయనే ఆందోళన ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా కంపెనీల వ్యాపారం 85 శాతం వరకూ పడిపోయింది. దీంతో సీఈవోల దగ్గర నుంచి ఉద్యోగుల వరకూ అందరి జీతాల్లో  కోతలు విధిస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి.

 

ఇప్పటికే కొన్ని ప్రణాళికలు వేసుకున్న కంపెనీలు.. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు అప్పగిద్దామని భావించిన సంస్థలు.. ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలను విరమించుకున్నాయి. ఉద్యోగాలు వదిలి వెళ్లాలనే ఒత్తిళ్లు మేనేజ్‌మెంట్ల నుంచి పెరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. దీనికితోడు రాబోయే కొన్ని నెలల వరకూ ఐటీ రంగంలో కొత్త జాబ్స్‌ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉపాధి కోల్పోయిన వారు కానీ.. కొత్తగా ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికిగానీ జాబ్‌ లభించడం కష్టమేనని అంటున్నారు నిపుణులు. ఈ మధ్యే వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంస్థలు పే కట్స్‌ ప్రారంభించాయి. కొత్తగా ఉద్యోగాల భర్తీని ఆపేశాయి. ఇలాంటి పరిస్థితి ఎంతకాలం ఉంటుందో అంచనా వేయలేని దుస్థితి నెలకొంది. ఐటీ రంగంలో ఇప్పట్లో కొత్త ఉద్యోగాల భర్తీ అనేది మర్చిపోవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ CII సైతం ఉద్యోగాల్లో భారీ కోతలు ఉంటాయని చెబుతోంది.  గతం వారం 200లకు పైగా సంస్థల సీఈవోలతో ఒక సర్వే నిర్వహించింది CII. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని 52 శాతం మంది సీఈవోలు చెప్పారు. తక్కువలో తక్కువగా 15 శాతం ఉద్యోగాల్లో కోత ఉంటుందని 42 శాతం మంది సీఈవోలు అభిప్రాయపడ్డారని అధ్యయనంలో వెల్లడించారు.  15 నుంచి  30 శాతం ఉద్యోగాలు పోతాయని  32 శాతం మంది అంచనా వేశారు. ఆదాయంలో 10 శాతానికి పైగాను, లాభాల విషయంలో  5 శాతానికంటే పైగా క్షీణత ఉంటుందని పలు సంస్థలు వెల్లడించాయి.  ఇదే జరిగితే దేశానికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవని, ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని అంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: