కరోనా ప్రభావం మామూలుగా లేదు. వైరస్‌ ఏ స్థాయిలో భయపెడుతుందో.. దీనివల్ల వచ్చే మాంద్యం కూడా అంతే స్థాయిలో ఆందోళనకు కారణం అవుతోంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది ఉపాధి కోల్పోతారని ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ అంచనా వేస్తోంది.

 

కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. ఇది క్రమంగా ఉద్యోగ, ఉపాధి రంగాలపై ప్రతికూల ప్రభావం చూపే దిశగా అడుగులు వేస్తోంది. 2008-2009 నాటి కంటే ఎక్కువగా ఆర్థిక మాంద్యం ఉండొచ్చనేది ఒక అంచనా. వెంటనే ప్రపంచ దేశాలు ఈ సమస్యకు సమిష్టిగా పరిష్కారం కనుగొనకపోతే పరిస్థితులు ఇంకా జటిలంగా మారతాయని ప్రపంచ కార్మిక సంస్థ-ILO  హెచ్చరిస్తోంది. ఉద్యోగ భద్రత కల్పించడం.. పన్నుల చెల్లింపుల్లో వెసులుబాటు, రాయితీలు ప్రకటించకపోతే ఇబ్బందులు తప్పవంటోంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తి దారుణంగా పడిపోనుండటంతో కనీసంలో కనీసంగా 53 లక్షల నుంచి అత్యధింగా రెండున్నర కోట్ల మంది  ఉపాధి కోల్పోతారని అంచనా వేస్తోంది ILO. 2008-2009 ఆర్థిక మాంద్యం సమయంలో రెండు కోట్ల 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. 


ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశ్రమలు పుంజుకోవడానికి సమయం పడుతుంది. ఒకవేళ తిరిగి పనులు ప్రారంభించినా.. వర్కింగ్‌ అవర్స్‌ తగ్గించడంతోపాటు జీతాల్లో కోతలు విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా స్వయం ఉపాధిపైన ఆధారపడిన వారు సమీప భవిష్యత్‌లో కోలుకునే పరిస్థితులు ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 3.4 లక్షల డాలర్ల ఆదాయాన్ని పరిశ్రమలు కోల్పోతాయని భావిస్తున్నారు. ఇది ఆర్థిక అసమానతలకు దారితీసే అవకాశం లేకపోలేదని అభిప్రాయ పడుతున్నారు నిపుణులు. 88 లక్షల నుంచి మూడున్నర కోట్ల మంది మళ్లీ పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందంటున్నారు.

 

తక్కువ వేతనాలపై పనిచేసే యువత, వృద్ధులు..మహిళా వలస కూలీలు రానున్న రోజుల్లో తిండికోసం అల్లాడే అవకాశం ఉందని ILO హెచ్చరిస్తోంది. మన దేశం వరకూ చూసుకుంటే.. 21 రోజుల లాక్‌ డౌన్‌ ప్రకటించగానే.. భవితపై బెంగతో నగరాల నుంచి తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోయారు నిరుపేదలు. వాహనాలు లేకపోయినా వందల కిలోమీటర్లు నడుచుకుంటూనే  వెళ్లారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత సొంతూళ్లకు వెళ్లినవారిలో ఎంత మంది  నగరాలకు తిరిగి వస్తారు. అలా వచ్చిన వారిలో ఎంత మందికి పని దొరుకుతుంది అనేది కూడా సమస్యే. ఒకవేళ నగరాలకు మళ్లీ వెళ్లకపోతే.. సొంతూళ్లలో పని దొరుకుతుందన్న గ్యారేంటీ లేదు. అందుకే ఈ సమయంలో ప్రభుత్వాల పాత్ర చాలా కీలకం. పరిశ్రమల యాజమాన్యలతో మాట్లాడి కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించడం .. ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం కుదర్చడం చాలా ముఖ్యం. చట్టాలకు అనుగుణంగా ఉద్యోగ భద్రత కల్పించడం కూడా ముఖ్యమే. 

 

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత షాపింగ్‌ మాల్స్‌ వంటివాటిని తిరిగి తెరిచినా.. కస్టమర్లు వెంటనే వచ్చి కొనుగోలు చేయరు. సాధారణ స్థితి నెలకొనడానికి కొంత సమయం పడుతుంది. అందుకే  షిప్ట్‌లలో పనిచేసేవారిలో కొందరిని తొలగించే అవకాశం ఉంది. స్టార్‌ హోటల్స్‌లలో కూడా ఇంచుమించు ఇలాంటి చర్యలే తీసుకోవచ్చు. విమానాశ్రయాలు మూతపడటంతో.. వాటికి అనుబంధంగా ఉండే హోటళ్లలో పనిలేదు. ఇదే విధంగా విదేశాల్లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసుకుంటూ చదువుకొనే వారికీ కష్టాలు తప్పవు. జీతాలు తగ్గించొద్దని, మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయా సంస్థలను ప్రధాని మోడీ కోరినా.. తమకున్న ఆర్థిక వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకుని చాలా సంస్థలు ఈ సూచనను పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో  అమెరికాలోని భారతీయ ఐటీ ప్రముఖుల్లో ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా అనే భయం కనిపిస్తోంది. H 1B వీసాలపై ఉద్యోగాలు చేసేవారు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. అమెరికా ఎకానమీ పెరిగినా ఐటీ ఉద్యోగులకు కష్టకాలమేనని అంటున్నారు.  అటు ఆరోగ్యంపై వైరస్‌ దాడి చేస్తుంటే.. ఇటు ఉద్యోగాలపై కరోనా కాటు వేస్తోందని వాపోతున్నారు ఉద్యోగులు.

మరింత సమాచారం తెలుసుకోండి: