కనికా కపూర్... కరోనా బారిన పడిన గాయని పేరు సుపరిచితమే.! చికిత్స సమయంలో వరుసగా 4 సార్లు పాజిటివ్‌ రిపోర్ట్స్ రావడంతో ఇక ఆమె కోలుకోవడం కష్టమేననుకున్నారంతా..! అయితే ఆమె ఎట్టకేలకు కోలుకుంది.. క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లింది.. దీంతో ఆమె కుటుంబసభ్యులతో పాటు బాలీవుడ్‌ మొత్తం హ్యాపీగా ఫీలవుతోంది.

 

బేబీ డాల్‌ ఫేమ్, బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే! మార్చి 9వ తేదీ లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్‌ కాన్పూర్‌, లక్నోలలో తిరిగారు. అదే సమయంలో ఆమె పలు పార్టీలకు హాజరవడంతో పాటు స్వయంగా ఆమే ఒక పార్టీ కూడా ఇచ్చారు. దీనికి పలువురు రాజకీయ నాయకులు, సినిమా రంగ ప్రముఖులు హాజరయ్యారు.

 

కనికా కపూర్‌కు జ్వరం, దగ్గు రావడంతో పరీక్షలు చేయించుకున్న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె మార్చి 20వ తేదీన లక్నోలోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స సమయంలో ఆమెకు వరుసగా 4 సార్లు కరోనా పాజిటివ్‌గా రావడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు విదేశాలకు తరలించాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో వీలు కాలేదు. దేవుడిపైనే భారం వేశామంటూ చెప్పొకొచ్చారు.

 

 తాజాగా నిర్వహించిన 2 పరీక్షల్లో కనికాకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. దీంతో వైద్యులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా రెండుసార్లు నెగెటివ్ రిపోర్టులు వస్తేనే డిశ్చార్జ్ చేసేందుకు వీలవుతుంది. కనికా కపూర్‌కు రెండు సార్లు నెగెటివ్ రావడంతో తాజాగా ఆమెను డిశ్చార్జ్‌ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కొంతకాలం పాటు ఐసోలేషన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

 

 అయితే చికిత్స సమయంలో కనికా కపూర్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. వైద్యులతో ఆమె దురుసుగా ప్రవర్తించిందని, చికిత్సకు సహకరించడం లేదని తెలిసింది. ఈ అంశంపై వైద్యులు ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు కనికా కపూర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన ఉన్నా.. ఆమె పట్టించుకోకుండా పలు పార్టీలకు హాజరయ్యారు. దీంతో ఆమెపై సెక్షన్‌ 188, 269, 270 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెను విచారించనున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: