ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అన్ని కార్యకలాపాలు నిలిచిపోవడం ఇంటి నుంచి కాలు బయట పెట్టే అవకాశం లేకపోవడంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వలస కూలీల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తినేందుకు తిండిలేక , ఉండేందుకు సరైన నీడ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వాలకు కూడా ఇది అతి పెద్ద సమస్యగా మారింది. 
 
 
 
లాక్ డౌన్  కారణంగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇక ప్రజలు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఇప్పటికే కేంద్రం తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 500 చొప్పున, వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేసింది. ఇవేకాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన ఆర్థిక సహాయం చేయడంతో పాటు,  ప్రజలకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా కరోనా ను కట్టడి చేయవచ్చు అని కేంద్రం భావిస్తున్నందున... ఇన్ని రోజుల పాటు దీనిని కఠినంగా అమలు చేస్తూ వస్తున్నారు. అయినా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోవడం, రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నిబంధనలు మరికొంతకాలం పొడిగించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.
 
 
 
 
 తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జూన్ 3వ తేదీ వరకు దీనిని పొడిగించాలని డిమాండ్ చేశారు. ఇక తమిళనాడు మహారాష్ట్ర, కర్ణాటకలలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ గడువును పెంచాలన్నా, యధావిధిగా చెప్పిన తేదీకి ఎత్తివేయాలో తెలియక  ఆలోచనలో పడింది. ఒకవేళ నిబంధనలు సడలిస్తే వైరస్ వ్యాప్తి మరింత ఉధృతమయ్యే అవకాశం లేకపోలేదు. మరికొంతకాలం ఈ నిబంధనలను పొడిగిస్తే దేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. అంతేకాకుండా 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో అందరిని ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టే సామర్థ్యం ప్రభుత్వాలకు లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం లాక్ డౌన్ విషయంలో ముందుకు వెనక్కి వెళ్లలేక సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: