కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉండడం ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెడితే, ఏపీలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. లాక్ డౌన్ నిబంధనలు ఏపీలో ఎంత కఠినంగా అమలు చేస్తున్నా, పరిస్థితి అదుపులోకి రాకపోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మొదట్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త అదుపులోనే ఉన్నట్టు గా కనిపించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీలో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. అయితే ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారి కారణంగా ఏపీలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు నమోదవడం, వారి ద్వారా అనేకమందికి ఈ వైరస్ రావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
 
 
ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఈ వైరస్ వ్యాప్తి ఏపీలో ఉధృతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304 చేరింది. ముఖ్యంగా కర్నూలు, నెల్లూరు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కఠిన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ముందుగా లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని చూస్తోంది. ముందుగా గుంటూరులో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నగరంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని, దీనికోసం ప్రత్యేకంగా ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించారు.
 
 
 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఏపీఎస్పీ బలగాలను పంపించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ నమోదైన ప్రాంతాల్లో నాలుగు ప్లాటూన్ ఏపీఎస్పీ బలగాలను వినియోగించుకోబోతున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది విషయంలోనూ జాగ్రత్త చర్యలు కఠినంగా తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు.  మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రత్యేక పోలీసులను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: