కొన్ని సంద‌ర్భాల్లో మంచి కూడా...చెడు లాగా క‌నిపిస్తుంది. గొప్ప సంద‌ర్భంపై కూడా...విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. మంచి చేసినా కూడా మాట‌లు ప‌డాల్సి వ‌స్తుంది. స‌రిగ్గా ఇప్పుడు భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప‌రిస్థితి ఇలాగే ఉందంటున్నారు. ఓవైపు దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు శ్ర‌మిస్తూనే..మ‌రోవైపు ఆయ‌న అంత‌ర్జాతీయంగా త‌న దౌత్య‌రీతిని కాపాడుకోవాల్సి వ‌స్తోంది. ఇప్పుడు ఆ చ‌ర్య వ‌ల్లే ప్ర‌ధానిని ప‌లువురు టార్గెట్ చేస్తున్నారు.

 

ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే.... మలేరియా నివార‌ణ‌కు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో... ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. మ‌రోవైపు అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో హైడ్రాక్సిక్లోరోక్వీన్‌కు డిమాండ్ పెరిగింది. అయితే... అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. తమ దేశంలో కరోనా వైరస్ పెరిగిపోతున్న సమయంలో... ప్రధాని మోదీని హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేసినప్ప‌టికీ ఆ ప్రతిపాదన ఫలించకపోవడం...అదే స‌మ‌యంలో భారత్ ఎగుమ‌తుల‌పై నిషేధం నిర్ణయం తీసుకోవడంతో... ట్రంప్‌ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఇండియాపై వాణిజ్య అంశాల్లో ప్రతీకారం తీర్చుకోవాలని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అనుకుంటున్నట్లుగా... హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్‌ను భార‌త్ త‌మ‌కు పంప‌ని ప‌క్షంలో టైం చూసి దెబ్బ కొడ‌తామ‌ని అన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది.

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్ర‌మే కాకుండా బ్రెజిల్‌, స్పెయిన్‌తో సహా కరోనా ప్రభావవంతంగా ఉన్న దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరా చేయాలని కోరారు. ప్రపంచ దేశాల డిమాండ్‌ మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అత్యవసరంగా అవసరమున్న దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మానవతా కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారాసిటమాల్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తగిన పరిమాణంలో పొరుగు దేశాలకు సరఫరా చేస్తామని చెప్పింది. ఈ మెడిసిన్స్‌ను అత్యవసరంగా అవసరమున్న దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ప్రకటించింది. అయితే, ఈ విష‌యంలో ప్ర‌ధాని మోదీపై కొంద‌రు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అమెరికా బెదిరింపుల‌కు మోదీ భ‌య‌ప‌డిపోయార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఆప‌త్కాలంలో ప్ర‌ధాని ఉదారంగా స్పందించి..వివిధ దేశాల ప్ర‌జ‌ల ప్రాణాలు నిలిపేందుకు కృషి చేస్తే..ఇదేంట‌ని ఇంకొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: