దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా భారీన పడి వృద్ధులు అధిక సంఖ్యలో మరణిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కరోనా దెబ్బకు వృద్ధులు బలవుతున్నారు. అయితే దక్షిణ కొరియా దేశంలో ప్లాస్మా థెరపీతో వైద్యులు ఇద్దరు వృద్ధులు కరోనా నుంచి కోలుకునేలా చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో చికిత్స చేసి వైద్యులు మంచి ఫలితాలు సాధించారు. 
 
వైద్యులు ప్లాస్మా థెరపీ ద్వారా ఇద్దరు వృద్ధులు కోలుకున్నారని ప్రకటించడంతో భవిష్యత్తులో ఈ థెరపీ ద్వారా కరోనాను కొంతవరకైనా నియంత్రించవచ్చని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ప్లాస్మాను సేకరించి వృద్ధులకు చికిత్స చేశామని వైద్యులు చెప్పారు. వైరస్ భారీన పడి కోలుకున్నవారిలో యాంటీ బాడీస్ తయారవుతాయని వైద్యులు చెబుతున్నారు. 
 
క్రిటికల్ కేర్ లో ఉన్న రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా కరోనాను నయం చేయవచ్చని... మందులకు స్పందించని రోగులకు ప్రత్యామ్నాయ చికిత్సగా ప్లాస్మా థెరపీ మారగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని చెప్పారు. సియోల్ లోని సెవెరన్స్ ఆస్పత్రి వైద్యుడు జాన్ యాంగ్ ఈ విషయాలను తెలిపారు. ప్లాస్మా థెరపీ ద్వారా కోలుకున్న వారిలో ఒకరు 71 సంవత్సరాలుగా కాగా మరొకరి వయస్సు 67 సంవత్సరాలు. 
 
ఆక్సిజన్ థెరపీ, హెచ్.ఐ.వీ మందులు, మలేరియా మందులు వృద్ధురాలిపై ప్రయోగించినా ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో ప్లాస్మా థెరపీతో పాటు స్టెరాయిడ్స్ ను ఉపయోగించామని వైద్యులు చెప్పారు. ఇతర దేశాలలో కూడా వైద్యులు ప్లాస్మా థెరపీని కరోనా బాధితులపై ప్రయోగిస్తున్నారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకూ 4789 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 304 కరోనా కేసులు నమోదు కాగా తెలంగాణలో 364 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కొత్తగా గుంటూరులో 8, నిజామాబాద్ లో 10 కేసులు నమోదైనప్పటికీ ప్రభుత్వాల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: