కరోనా కట్టడిలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తొలుత చేసిన నిర్లక్ష్యానికి ప్రజలు  ఇప్పుడు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి పరిస్థితి నెలకొంది . ప్రపంచం లోని ఇతర దేశాల్లో కరోనా మహమ్మరి పడగవిప్పి కరాళనృత్యం చేస్తోన్న  సమయం లో,  దేశంలోకి విదేశీ ప్రయాణికులను యథేచ్ఛగా  అనుమతించడం ద్వారా కేంద్ర  ప్రభుత్వమే  కరోనా బాధితులకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికినట్లయింది . పోనీ రాష్ట్ర ప్రభుత్వాలైన ఈ విషయంలో ముందు జాగ్రత్త వహించాయా? అంటే అది లేదు . ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైతే  ఒకర్ని మించి మరొకరు పోటీ పడి, ఈ వ్యాధి పట్ల  తమకున్న అవగానే రాహిత్యాన్ని చాటుకున్నారు .

 

ప్రాథమిక దశలోనే విదేశీయులను పకడ్బందీగా  క్వారంటైన్ చేసి ఉంటే, ఇప్పుడు నెలల తరబడి లాక్ డౌన్ ప్రకటించాల్సిన దుస్థితి తలెత్తి ఉండేది కాదు . ఒకదశలో విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేయడం ద్వారా , కరోనా కట్టడి అవుతుందని అందరూ భావించారు . అంతలోనే  నిజాముద్దీన్ మర్కజ్ మసీదు లో తబ్లీగి జమాత్ మతసమ్మేళనం లో పాల్గొన్న వారి వల్ల , కరోనా దేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తృతి చెందుతోంది . ఒకవైపు లాక్ డౌన్ నిబంధనలు అమలు లో ఉండగా మతసమ్మేళనం నిర్వహించరాదన్న ఇంగితాన్ని నిర్వాహకులు మర్చితే, మరి నిఘా వ్యవస్థ ఎందుకు పసిగట్టి ఆ సమ్మేళనాన్ని  అడ్డుకోలేకపోయిందన్న  మిలియన్ డాలర్ల ప్రశ్నకు పాలకుల వద్ద సమాధానం లేకుండా పోయింది .

 

ప్రాథమిక దశలోనే కట్టడి చేయాల్సిన కరోనా వైరస్  ను  పాలకులు తమ అవగాహన  రాహిత్యం వల్ల గేట్లు బార్ల తెరిచి స్వాగతం పలికి  , ఇప్పుడేమో లాక్ డౌన్ ను పొడగించాల్సిందేనంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు . లాక్ డౌన్ అంటూ పొడిగిస్తే పాలకులకు వచ్చే నష్టం కన్నా పేదలు ఎదుర్కొనే ఇబ్బందులే అధికమన్నది నిర్వివాదాంశం . కేంద్ర , రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోతే ఆ భారాన్ని ప్రజలపైనే మోపుతారు ... కానీ  అదే ఒక పేదవాడి కుటుంబం ఆర్ధికంగా చితికిపోతే, వారిని  ఆదుకునేవారెవరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: